కమల్ హాసన్ ను యూనివర్సల్ హీరోగా, కె. విశ్వనాధ్ ను కళాతపస్విగా, జయప్రదను మంచినటిగా, శైలజను నర్తకిగా, ఎస్.పి బాలును ఉత్తమ గాయకుడిగా నిలబెట్టడానికి తోడ్పడిన సినిమాలలో ‘సాగరసంగమం’ ఒకటి. ఏడిద నాగేశ్వరరావు నిర్మాణంలో కళను ఆరాదించే దర్శకుడు కె.విశ్వనాధ్ దర్శకత్వంలో మాస్ట్రో ఇళయరాజా స్వర మయాజాలంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఈ సినిమాలో బాలకృష్ణ పాత్రను కమల్ తప్ప మరెవ్వరూ చెయ్యలేరు. తృతీయ ఉత్తమ సినిమాగా కాంస్య నంది గెలుచుకున్న ఈ సినిమా రష్యా ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శితం అవ్వడమే కాక, ఆ భాషలోకి అనువాదం అవ్వడం విశేషం.
ఈ సినిమాలో ప్రతీ పాట అద్బుతమే. ఎస్. పి, ఎస్. జానకి గార్లు ఆలాపించి, వేటూరి రచించి మనల్ని తన్మయత్వంలో ముంచెత్తారు. జంధ్యాల అందించినమాటలు, తోట తరుణీ తయారుచేసిన ఆర్టును ఎవ్వరూ మర్చిపోలేరు. ఈ సినిమా నటులపై ఎంత ప్రభావంచూపించిందో చెప్పడానికి ఎస్.పి శైలజ నా జీవితనికి ఈ ఒక్క సినిమా చాలు అని తరువాత మరే ఇతర సినిమాలోనూ నటించకపోవడం అన్న ఉదాహరణ చాలు. ఎంతోమంది మదిలో చిరస్థాయిగా నిలిచిపోయే స్థాయిలో ఉన్న ఈ సినిమా నేటితో 30వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంలో 123తెలుగు ద్వారా చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.