విక్టరీ వెంకటేష్, ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోలుగా సంతిస్తున్న మల్టీ స్టారర్ సినిమా ‘మసాల’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమా రిలీజ్ కి ముందు చేసే ప్రచార కార్యక్రమాల్ని వినూత్న రీతిలో చేయడానికి ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తోంది. అందుకోసం ఇటీవలే ‘వైవా’ అనే షార్ట్ ఫిల్మ్ తీసి బాగా ఫేమస్ అయిన హర్ష చెముడుతో ఓ స్పెషల్ వీడియోని తయారు చేస్తున్నారు. ఆ షార్ట్ ఫిల్మ్ లో లాగానే ఈ వీడియోలో కూడా హర్ష, వెంకటేష్, రామ్ లను కొన్ని ప్రశ్నలు అడుగుతుంటాడు, ఆ ప్రశ్నలకి వెంకీ, రామ్ లు ఎలా సమాధానాలు చెప్పారు అనేదాన్ని వీడియో రూపంలో మనకి అందించనున్నారు. ఈ వీడియో త్వరలోనే యు ట్యూబ్ లో దర్శనం ఇచ్చే అవకాశం ఉంది.
అంజలి, శాజన్ పదమ్సీ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా హిందీలో సూపర్ హిట్ అయిన ‘బోల్ బచ్చన్’ సినిమాకి రీమేక్. విజయ్ భాస్కర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని డి. సురేష్ బాబు – స్రవంతి రవి కిషోర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.