ఎస్‌ఆర్‌ఎస్ మూవీ క్రియేషన్స్, ఇందిరా దేవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై రూపాశ్రీ కొపురు నిర్మిస్తున్న ప్రేమకథా చిత్రం ‘ఓ.. చెలియా’ నుంచి ‘కొంచెం కొంచెంగా’ అనే మెలోడీ పాటను హీరో నవీన్ చంద్ర విడుదల చేశారు. నాగ ప్రణవ్, కావేరి కర్ణిక, ఆద్య రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఎం. నాగ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.
ఇప్పటికే పోస్టర్లు, గ్లింప్స్, టీజర్లతో ఆకట్టుకున్న ఈ సినిమా నుంచి విడుదలైన ఈ పాట శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఎంఎం కుమార్ అందించిన శ్రావ్యమైన బాణీకి, సుధీర్ బగాడి సులభమైన సాహిత్యం తోడైంది. వాగ్దేవి, మనోజ్ గానం ఈ యుగళ గీతానికి మరింత అందాన్నిచ్చింది. లిరికల్ వీడియోలో హీరో, హీరోయిన్ల మధ్య గాఢమైన ప్రేమను చూడవచ్చు.
పాట విడుదల అనంతరం నవీన్ చంద్ర మాట్లాడుతూ, “ఈ మధ్య కాలంలో ఇంత మంచి మెలోడీ పాట వినలేదు. హీరో, హీరోయిన్లు చాలా చక్కగా ఉన్నారు. లవ్, థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలి” అని కోరారు. సురేష్ బాలా కెమెరా వర్క్, ఉపేంద్ర ఎడిటింగ్ ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలవనున్నాయి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.
