యూరప్ వెళ్తున్న మంచు విష్ణు


గత కొంతకాలం నుంచి మన తెలుగు టాప్ హీరోల సినిమాలు వరుసగా యూరప్ లోని అందమైన ప్రదేశాల్లో చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. తాజాగా ఆ లిస్టులో మంచు విష్ణు కూడా చేరనున్నారు. విష్ణు హీరోగా, బొద్దు గుమ్మ హన్సిక కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘దేనికైనా రెడీ’. ఇటీవలే ఈ చిత్ర టీం ప్రేమ రక్షిత్ మాస్టర్ నేతృత్వంలో బాంకాక్లో ఒక పాటను చిత్రీకరించుకొని ఇండియాకి తిరిగి వచ్చారు. త్వరలోనే మరో పాట చిత్రీకరణ కోసం మంచు విష్ణు మరియు అతని టీం యూరప్ వెళ్లనున్నారు. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలకు విష్ణు వాయిస్ కి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ డబ్బింగ్ చెప్పడం విశేషం. 24 ఫ్రేమ్స్ ఫాక్టరీ బ్యానర్ పై మంచు విష్ణు నిర్మిస్తున్న ఈ చిత్రానికి జి. నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ కథా రచయితలు కోన వెంకట్ – గోపి మోహన్ కథ అందించిన ఈ చిత్రానికి చక్రి సంగీతం అందిస్తున్నారు. చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని ఈ సంవత్సరం చివర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Exit mobile version