లెజెండ్రీ తెలుగు నటుడు శ్రీ నందమూరి తారక రామారావు, డా. మోహన్ బాబు కలిసి 1993లో చేసిన సినిమా ‘మేజర్ చంద్రకాంత్’. ఆ సంవత్సరం బిగ్ హిట్ గా నిలిచిన ఈ సినిమా విడుదలై ఈ రోజుటికి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాని మోహన్ బాబు నిర్మించాడు.
ఈ సందర్భంగా మోహన్ బాబు మీడియా తో మాట్లాడుతూ కొన్ని ఆసక్తి కరమైన విషయాలను షేర్ చేసుకున్నారు. ‘ నేను ఎన్.టి.ఆర్ గారితో సినిమా తీయాలనుకొని ఆయన్ని అవకాశం ఇమ్మని అడగడానికి వెళ్లాను. నేను అలా అడగగానే అన్నగారు ‘ నేను ఎలక్షన్స్ లో ఓడిపోయాను. ఇప్పుడు నన్ను బిగ్ స్క్రీన్ పై ఎవరు చూస్తారు?’ అన్నారు. నేను ఎంతో పట్టుబట్టి ఒప్పించడంతో ‘మేజర్ చంద్రకాంత్’ సినిమా మీ ముందుకు రావడం జరిగిందని’ అన్నాడు.
అలాగే మోహన్ బాబు మాట్లాడుతూ ‘ నేను ఈ సినిమా మొదలు పెట్టేటప్పుడు అన్న గారికి 25 లక్షలు అడ్వాన్స్ గా ఇవ్వబోతే ఆయన అంత తీసుకోకుండా కేవలం 2 లక్షలు మాత్రమే తీసుకొని ముందు సినిమా పూర్తి చెయ్యమన్నారు. అ తర్వాత ఫైనల్ అమౌంట్ నేను ఎంత ఇచ్చాను అనేది నాకు, ఎన్.టి.ఆర్ గారికి మాత్రమే తెలుసు అది సీక్రెట్’ అని అన్నారు. అమ్రిష్ పురి, రమ్య కృష్ణ, నగ్మ, బ్రహ్మానందంలు ‘మేజర్ చంద్రకాంత్’ లో కీలక పాత్రలు పోషించారు.