తన సినిమా ఈవెంట్లలో తప్ప బయట పెద్దగా కనిపించరు సూపర్ స్టార్ మహేష్ బాబు. కానీ అప్పుడప్పుడు తన మిత్రులు, సన్నిహితుల కోసం బయటికొస్తుంటారు. వాళ్ళ సినిమా టీజర్లు, ట్రైలర్లు రిలీజ్ చేస్తుంటారు. అలా ఇప్పుడు తన కాలేజ్ మిత్రుడు అల్లరి నరేష్ సినిమా ట్రైలర్ తన చేతుల మీదుగా రిలీజ్ చేయనున్నారు. అదేమిటి మహేష్, నరేష్ కలిసి ఎప్పుడు చదువుకున్నారు అనుకుంటున్నారా.. అదేనండీ మహేష్ రీసెంట్ హిట్ మూవీ ‘మహర్షి’లో వీళ్లిద్దరూ కాలేజ్ మిత్రులే కదా. ఆ సినిమా సమయంలో ఇద్దరి మధ్యా మంచి సాన్నిహిత్యం, స్నేహం ఏర్పడ్డాయి.
ఆ అనుభంధంతోనే అల్లరి నరేష్ చేసిన ప్రయోగాత్మక చిత్రం ‘నాంది’ ట్రైలర్ ను మహేష్ విడుదల చేయనున్నారు. రేపు 6వ తేదీ ఉదయం 10:08 గంటలకు ట్రైలర్ లాంఛ్ కానుంది. ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్లతో సినిమాపై ప్రేక్షకుల్లో అమితాసక్తి నెలకొంది. నరేష్ గతంలో ‘నేను, గమ్యం’ లాంటి డిఫరెంట్ సబ్జెక్ట్స్ చేసి ఉండటంతో ఈ సినిమా కూడ ఆ తరహాలోనే వాస్తవికతకు దగ్గరగా ఉంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. విజయ్ కనకమేడల డైరెక్ట్ చేసిన ఈ సినిమాను సతీష్ వేగేశ్న నిర్మించారు. వరలక్ష్మీ శరత్ కుమార్, ప్రియదర్శిలు ఇందులో కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 19న థియేటర్లలో విడుదలచేయనున్నారు.