యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఇక ఈ సినిమాని భారీ లెవల్లో రూపొందిస్తున్నారు జక్కన్న. కాగా సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా, తారక్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ ఇద్దరు యోధుల యంగర్ వెర్షన్ మాత్రమే సినిమాలో ఉంటుందని, ఎవరికీ తెలియని కొమురం భీమ్ ని, అలాగే అల్లూరిని చూపిస్తానని రాజమౌళి సినిమా ప్రకటన రోజే స్పష్టం చేశారు.
కానీ ఫ్యాన్స్ మాత్రం చేతిలో విల్లంబులతో మనకు తెలిసిన అల్లూరిని, తుపాకీ ధరించిన కొమురం భీమ్ ను ఊహించుకుంటున్నారు. ఆ ఊహలకు తగ్గట్టు ఎడిట్స్ చేసిన పోస్టర్స్ ను సోషల్ మీడియాలో వదులుతున్నారు. ఒకవేళ సినిమాలో అల్లూరి – భీమ్ చేతుల్లో వాళ్ళ వాడిన ఆయుధాలు లేకపోతే ఫ్యాన్స్ నిరుత్సాహ పడతారనే ఉద్దేశ్యంతో జక్కన్న క్లైమాక్స్ లో ఆ ఆయుధాలను వాడుతున్నారట. ఆ ఆయుధాలు పట్టుకోగానే వారి పోరాటం మొదలవుతుందని చివర్లో చెప్పి సినిమాని ముగిస్తారట.
ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ‘బాహుబలి’ సిరీస్ అనంతరం రాజమౌళి నుండి చేస్తున్న ప్రాజెక్ట్ కావడం, పైగా ఇద్దరు స్టార్ హీరోలతో బాలీవుడ్ స్టార్స్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆరంభం నుండి భారతీయ అన్ని సినీ పరిశ్రమల్లో అత్యున్నత భారీ అంచనాలు నెలకొన్నాయి.