‘కింగ్డమ్’ గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ హైలైట్స్!

Kingdom

టాలీవుడ్ ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘కింగ్డమ్’. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్, యువ నటుడు వెంకటేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘కింగ్‌డమ్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి తీసుకువెళ్ళింది. సోమవారం(జూలై 28) సాయంత్రం హైదరాబాద్ లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌ లో ‘కింగ్‌డమ్’ ప్రీ రిలీజ్ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. అభిమానుల కోలాహలం నడుమ అతిరథ మహారథుల సమక్షంలో వైభవంగా జరిగిన ఈ వేడుకలో అనిరుధ్ సంగీత ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇలా మరిన్ని హైలైట్స్ చూస్తే..

‘కింగ్డమ్’ ప్రీ రిలీజ్ వేడుకలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. “మరో రెండు రోజుల్లో జులై 31న మిమ్మల్ని థియేటర్లలో కలవబోతున్నాం. మనసులో కొంచెం భయం ఉంది, అదే సమయంలో ఓ మంచి సినిమా చేశామనే సంతృప్తి ఉంది. ‘కింగ్‌డమ్’ అవుట్ పుట్ పట్ల టీమ్ అందరం సంతోషంగా ఉన్నాము. ఈరోజు నేను అభిమానుల గురించి ప్రత్యేకంగా మాట్లాడాలి అనుకుంటున్నాను. మీరు నాకు దేవుడిచ్చిన వరం. సినిమాలు హిట్ అయినా, ఫ్లాప్ అయినా.. అదే ప్రేమ, అదే నమ్మకం నాపై చూపిస్తున్నారు. ఈ రోజు ఫ్యాన్ మీట్ లో దాదాపు రెండు వేల మందిని కలిశాను. అందులో ఎక్కువమంది నాతో చెప్పిన మాట ‘అన్నా ఈసారి మనం హిట్ కొడుతున్నాం’. నన్ను మీ వాడిని చేసేసుకున్నారు. నా విజయాన్ని చూడాలని మీరు కోరుకుంటున్నాను. సినిమా వల్లే మీకు నేను పరిచయం అయ్యాను. మీ కోసం ప్రతి సినిమాకి ప్రాణం పెట్టి పనిచేస్తాను. మీరందరూ నా నుంచి కోరుకుంటున్న హిట్ ‘కింగ్‌డమ్’తో రాబోతుంది. ఇది విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ కాదు.. గౌతమ్ తిన్ననూరి ‘కింగ్‌డమ్’. ఈ కథ ఆలోచన పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఈ సినిమా పని మీదే ఉన్నాడు గౌతమ్. ఒక పర్ఫెక్ట్ సినిమా ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇప్పటికీ వర్క్ చేస్తున్నాడు. అందుకే ఈ వేడుకకి రాలేకపోయాడు. ఆ తర్వాత ఇది అనిరుధ్ రవిచందర్ ‘కింగ్‌డమ్’. పాటలు ఇప్పటికే విన్నాము. నేపథ్యం సంగీతం కూడా అదిరిపోతుంది. నా సినిమాకి అనిరుధ్ సంగీతం అందిస్తే బాగుంటుంది అనుకునేవాడిని. అది ‘కింగ్‌డమ్’తో నెరవేరింది. తన సంగీతంతో సినిమాని మరో స్థాయికి తీసుకెళ్ళాడు. ఆ తర్వాత ఇది ఎడిటర్ నవీన్ నూలి ‘కింగ్‌డమ్’. నాలో ఒక ఫైర్ ఉంటుంది. మా వాళ్లకి బెస్ట్ ఇవ్వాలని కోరిక ఉంటుంది. ఈసారి నాకు ఇంత ఫైర్ ఉన్న టీమ్ దొరికింది. అలాగే ఇది నాగవంశీ ‘కింగ్‌డమ్’. ఎంతో రిస్క్ చేసి ఈ సినిమా చేశారు. బెస్ట్ అవుట్ పుట్ రావడం కోసం.. ఎక్కడా రాజీ పడకుండా మేము ఏది అడిగితే అది ఇచ్చారు. భాగ్యశ్రీ బోర్సే కొత్తమ్మాయి. కానీ, సినిమా కోసం చాలా కష్టపడుతుంది. రాబోయే రోజుల్లో పెద్ద స్థాయికి వెళ్తుంది. నా సోదరులు సత్యదేవ్, వెంకటేష్ ఇద్దరూ చాలా మంచి నటులు. ఈ సినిమాలో అన్న పాత్ర చాలా ముఖ్యమైనది. ఆ పాత్రలో సరైన నటుడు చేస్తేనే సినిమా పండుతుంది. అలాంటి పాత్ర ఎవరు చేస్తే బాగుంటుందని చాలా చర్చించిన తర్వాత.. సత్యదేవ్ ని ఎంపిక చేశాడు గౌతమ్. షూటింగ్ సమయంలో సత్యదేవ్ నిజంగానే నాకు సోదరుడిలా అనిపించాడు. సత్యదేవ్ అద్భుతమైన నటుడు మాత్రమే కాదు, మంచి మనిషి కూడా. అలాగే వెంకటేష్ అద్భుతంగా నటించాడు. భవిష్యత్ లో బిగ్ స్టార్ కావాలని కోరుకుంటున్నాను. కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన, ఆర్ట్ డైరెక్టర్ అవినాష్‌ కొల్లా, సినిమాటోగ్రాఫర్స్ జోమోన్, గిరీష్.. ఇలా ప్రతి ఒక్కరూ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేశారు. రెండు రోజుల్లో ‘కింగ్‌డమ్’ మీ ముందుకు రాబోతుంది. ఈ సినిమా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను.” అని తెలిపాడు.

ఇక సెన్సేషనల్ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ మాట్లాడుతూ.. “తెలుగు సినిమాల పరంగా నా మెంటర్ నాగవంశీ గారు. నా సాంగ్ హిట్ అయితే ఆయన చాలా హ్యాపీగా ఫీలవుతారు. ‘కింగ్‌డమ్’ లాంటి గొప్ప సినిమాలో నన్ను భాగం చేసిన నాగవంశీ గారికి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ టీమ్ కి నా కృతఙ్ఞతలు. సోదరుడు గౌతమ్ దర్శకత్వం వహించిన ‘జెర్సీ’ చిత్రానికి ఎందరో అభిమానులు ఉన్నారు. ‘కింగ్‌డమ్’ అంతకుమించిన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఈ సినిమా విడుదల కోసం మేమందరం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. సినిమా అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది. భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్, వెంకటేష్ అద్భుతంగా నటించారు. ఇండియాలో ఉన్న ఫైనెస్ట్ ఎడిటర్స్ లో నవీన్ నూలి ఒకరు. విజయ్ చాలా మంచి మనిషి. ఇతరుల యోగక్షేమాల గురించి ఆలోచిస్తాడు. నేను ఈ చిత్రం కోసం పని చేస్తున్న సమయంలో.. ‘మనకి నిద్ర అనేది ముఖ్యం, తగిన నిద్ర పోతూ విశ్రాంతి తీసుకుంటున్నావని ఆశిస్తున్నాను’ అని విజయ్ నుంచి నాకు మెసేజ్ వచ్చింది. అంత గొప్పది విజయ్ మనసు. నేను ‘కింగ్‌డమ్’ చిత్రం చూశాను. ఈ సినిమా విజయ్ కెరీర్ తో పాటు, నా కెరీర్ లో, గౌతమ్ కెరీర్ లో, నాగవంశీ కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలుస్తుంది. ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది. బుకింగ్స్ కూడా బాగున్నాయి. ఈ సినిమా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ‘కింగ్‌డమ్’ ద్వారా మేము తెలుగు ప్రేక్షకుల కోసం ఓ కొత్త ప్రయత్నం చేశాము. ఈ ప్రయత్నాన్ని మీరు ఆదరిస్తారని నమ్ముతున్నాను. నా కెరీర్ ప్రారంభం నుంచి నా పాటలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. మీ వాడిగా భావించి నాపై ప్రేమ కురిపిస్తున్నారు. మీ ప్రేమకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.” అన్నారు.

ఇక కథానాయిక భాగ్యశ్రీ బోర్సే మాట్లాడుతూ.. “జులై 31న విడుదల కానున్న ‘కింగ్‌డమ్’ కోసం మీతో పాటు నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. గౌతమ్ గారు ఈ సినిమాని అద్భుతంగా రూపొందించారు. ఇందులో పవర్ ఫుల్ పర్ఫామెన్స్ లు చూడబోతున్నారు. ప్రేక్షకులు నాపై చూపిస్తున్న ప్రేమ వల్లే నాకు నటిగా ఇన్ని అవకాశాలు వస్తున్నాయి. ఇలాంటి గొప్ప సినిమాలో విజయ్ లాంటి నటుడితో కలిసి నటించడం సంతోషంగా ఉంది. గౌతమ్ గారు ఎంతో ప్రతిభగల దర్శకుడు. నాకు ఈ అవకాశం ఇచ్చిన నాగవంశీ గారికి కృతఙ్ఞతలు. కింగ్‌డమ్ సినిమాకి అనిరుధ్ గారు హార్ట్ బీట్. సత్యదేవ్ గారు అద్భుతంగా నటించారు. జులై 31న థియేటర్లలో కలుద్దాం.” అని తెలిపింది.

టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ మాట్లాడుతూ.. “కింగ్‌డమ్ లో భాగమైనందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. విజయ్ ను నేను చాలా దగ్గర నుంచి చూశాను. చాలా అరుదైన వ్యక్తి. మంచి మనిషి, ఇతరుల గురించి కేర్ తీసుకుంటాడు. విజయ్ ఈ సినిమాతో ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సామాన్యుడిలా వచ్చి ఒక్కో మెట్టు ఎక్కుతూ ‘కింగ్డమ్’ను స్థాపించుకున్న విజయ్ అంటే నాకు అపార గౌరవం. విజయ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే దేవరకొండ కాదు బంగారుకొండ. అనిరుధ్ ఏది పట్టుకుంటే అది బంగారం. అనిరుధ్ సంగీతం అందించిన సినిమాలో భాగం కావడం గర్వంగా ఉంది. నాగవంశీ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఎవరైతే కొన్ని సినిమాలు చేయడానికి భయపడతారో.. అలాంటి సినిమాలు నాగవంశీ గారు చేసి హిట్లు కొట్టి, గట్స్ ఉన్న నిర్మాత అనిపించుకున్నారు. విజయ్ తో పాటు ఈ సినిమాను ప్రమోట్ చేసే బాధ్యతను నాగవంశీ గారు తీసుకున్నారు. ప్రతి నటుడు గౌతమ్ దర్శకత్వంలో ఒక్క సినిమా అయినా చేయాలనేది నా అభిప్రాయం. మనలో ఇంత నటన దాగుందా అని మనమే ఆశ్చర్యపోయేలా.. మన నుంచి నటనను రాబడతాడు. భవిష్యత్ లోనూ గౌతమ్ తో సినిమా చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నాను. భాగ్యశ్రీ బోర్సే, వెంకటేష్ తో సహా అందరూ అద్భుతంగా నటించారు.” అన్నారు.

ఇక నటుడు వెంకటేష్ మాట్లాడుతూ, “మలయాళంలో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ నటుడిగా ప్రయాణం మొదలుపెట్టిన నేను.. ఇప్పుడు ‘కింగ్డమ్’లో భాగమయ్యాను. ఈ సినిమాలో నటించడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశమిచ్చిన నాగవంశీ గారికి కృతఙ్ఞతలు. ఇప్పటిదాకా నేను పని చేసిన బెస్ట్ ప్రొడక్షన్ హౌస్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్. సితారలో మరిన్ని సినిమాలు చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నాను. సత్యదేవ్ గారు గొప్ప నటుడు. ఆయన నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను. తెలుగులో నేను విజయ్ దేవరకొండ గారితో ‘కింగ్డమ్’ సినిమా చేస్తున్నానని చెప్పినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. గౌతమ్ గారు ఈ సినిమాలో నా నటనను మెచ్చుకోవడం గర్వంగా అనిపించింది.” అన్నారు.

Exit mobile version