ఇండియాలోని అన్ని అవార్డులు వస్తాయంటున్న డా. మోహన్ బాబు

ఇండియాలోని అన్ని అవార్డులు వస్తాయంటున్న డా. మోహన్ బాబు

Published on Mar 7, 2013 12:59 AM IST

Gundello-Godaari

లక్ష్మీ మంచు, ఆది, తాప్సీ, సందీప్ కిషన్ ప్రధాన పాత్రలలో మంచు ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై తెరకెక్కిన సినిమా ‘గుండెల్లో గోదారి’. ఈ శుక్రవారం మహిళా దినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకి మాస్ట్రో ఇళయరాజా అందించిన మ్యూజిక్ ఆల్బం హిట్ అవ్వడంతో ఈ రోజు ప్లాటినం డిస్క్ ఫంక్షన్ జరిగింది. ఈ వేడుకకి దర్శకరత్న దాసరి నారాయణ రావు, దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు, డా. మోహన్ బాబు, బి. గోపాల్, ఎమ్.ఎమ్ కీరవాణి, కోఠి, పరుచూరి గోపాలకృష్ణ, శ్రీ వాస్, మనోజ్, లక్ష్మీ మంచు, సందీప్ కిషన్, కార్తీక తదితరులు హాజరయ్యారు.

ఈ వేడుకలో దాసరి మాట్లాడుతూ ‘ మోహన్ బాబు వారసులుగా గోల్డ్ స్పూన్ తో పుట్టినప్పటికీ మోహన్ బాబు కంటే ఎక్కువ కష్టపడి వారి సొంత కాళ్ళపై నిలబడుతున్నారు. ఈ సినిమా తీసే సాహసం చేసే లక్ష్మీని మెచ్చుకోవాలి. లక్ష్మీ లా కష్టపడే మరో అమ్మాయి ఇండస్ట్రీలో లేదు. ఈ సభా ముఖంగా చెబుతున్నా నేను విష్ణు, మనోజ్, లక్ష్మీ ముగ్గురితోనూ సినిమాలు చేస్తాను. ఇప్పటికి 150 సినిమాలు చేశా ఖచ్చితంగా 200 పూర్తి చేస్తాను. గుండెల్లో గోదారి సినిమా చూసాను. సినిమా చాలా బాగుంది కానీ సినిమాలో భూతు డైలాగ్స్, సెక్స్, రికార్డు డాన్సులు కోరుకునే వారు ఈ సినిమాకి రావద్దు. మీరు కోరుకునేవి ఏమీ ఇందులో ఉండవు. సినిమా ఎంత సాధిస్తుంది, హిట్ అవుతుందా, లేదా అనేది పక్కన పెడితే ఇదొక గొప్ప సినిమా’ అని ఆయన అన్నారు.

డా మోహన్ బాబు మాట్లాడుతూ ‘ ఇళయరాజా గారు తన కూతురు కంటే ఎక్కువ ప్రేమని లక్ష్మీ మంచుకి పంచి అద్భుతమైన పాటలు ఇచ్చాడు. సినిమా విజయాన్ని ప్రేక్షకులే నిర్ణయిస్తారు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను ఈ సినిమాకి ఇండియాలోని అన్ని అవార్డులు వస్తాయి అందులో సందేహం లేదని’ ఆయన అన్నారు.

సందీప్ కిషన్ మాట్లాడుతూ ‘నటుడిగా నన్ను నేను నిరూపించుకునే అవకాశం ఈ సినిమాతో వచ్చింది అందుకే ఈ సినిమా చేసానని’ అన్నాడు. లక్ష్మీ మంచు మాట్లాడుతూ ‘ సినిమా చాలా బాగా వచ్చింది. దయచేసి థియేటర్ కి వచ్చి సినిమా చూడండి. పైరసీలో సినిమా చూడకండి. పైరసీని ఆపండని’ అన్నారు

తాజా వార్తలు