డా. మోహన్ బాబు కుమార్తె లక్ష్మీ మంచు నిర్మాతగా 1983లో వచ్చిన గోదావరి వరదల నేపధ్యంలో తెరకెక్కించిన సినిమా ‘గుండెల్లో గోదారి’. ఈ సినిమాని తమిళంలో ‘మరంతేన్ మన్నితేన్’ అనే పేరుతో విడుదల చేయనున్నారు. ఈ తమిళ సినిమా ఆడియో నిన్న చెన్నైలో పలువురు ప్రముఖుల సమక్షంలో జరిగింది. ఈ ఆడియో వేడుకలో ఈ సినిమాకి సంగీతం అందించిన మాస్ట్రో ఇళయరాజా మాట్లాడుతూ ‘ నాకు తెలిసినప్పటి నుంచి సూపర్ స్టార్ రజినీ కాంత్ మరియు డా. మోహన్ బాబు మంచి స్నేహితులు. సినిమాల్లోకి రాకముందు వారు పాండిబజార్లో నివసిస్తూ ఒక్క పూట కూటి కోసం కూడా ఎంతో కష్ట పడేవారు. ఆ తర్వాత ఇద్దరూ ఎంతో ఉన్నత స్థాయికి వచ్చారు. వారి స్థాయితో పాటే వారి స్నేహం కూడా పెరిగి పెద్దదై, వారిద్దరూ ఎలాంటి భేషజాలు లేకుండా కలిసి ఉండడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని’ ఆయన అన్నారు. ఆది, సందీప్ కిషన్ ,తాప్సీ మరియు లక్ష్మీ మంచు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ద్వారా కుమార్ నాగేంద్ర దర్శకుడిగా పరిచయమవుతున్నారు.