ఇప్పటికే ఓసారి ఆర్ ఆర్ ఆర్ విడుదల వాయిదా వేసిన రాజమౌళి ఈసారైనా చెప్పిన టైం కి రావాలనే గట్టి ప్రయత్నంలో ఉన్నారు. రాజమౌళి ప్రకటించిన తేదికి ఇంకా ఎనిమిది నెలల సమయం మాత్రమే ఉంది. ప్రశాంతంగా ఆర్ ఆర్ ఆర్ పూర్తి చేసి విడుదల చేద్దామని వచ్చే ఏడాది జనవరి వరకు సమయం తీసుకున్న రాజమౌళిని కరోనా వైరస్ రూపంలో దెబ్బేసింది. ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా ప్రపంచం మొత్తం స్థంభించిపోయింది. కర్ఫ్యూ ఇంకా ఎక్కువ కాలం కొనసాగే తరుణంలో ఆర్ ఆర్ ఆర్ మిగిలిన షూటింగ్ సెట్స్ లో చిత్రీకరించాలని రాజమౌళి భావిస్తున్నారు.
ఐతే ఇక్కడి నటులు ఎదో విధంగా ప్రత్యేక పర్మిషన్స్ తో సెట్ కి హాజరయ్యే పరిస్థితి ఉంది. మరి ఆర్ ఆర్ ఆర్ లో ముగ్గురు విదేశీ నటులను తీసుకోవడం జరిగింది. వీరిలో ఒకరు ఎన్టీఆర్ హీరోయిన్ అయిన ఒలీవియా మోరిస్ ఉన్నారు. ఆమె లండన్ ఆర్టిస్ట్ కాగా ఆమెను ఈ లాక్ డౌన్ సమయంలో ఇండియాకి తేవడం అంటే జరగని పని. మరి ఈ విషయాన్ని రాజమౌళి ఎలా మేనేజ్ చేస్తాడు అనేది పెద్ద సమస్య. సమీప కాలంలో సాధారణ పరిస్థితులు ఏర్పడకపోతే మళ్ళీ ఎన్టీఆర్ హీరోయిన్ ని జక్కన్న మార్చే అవకాశం కలదు.