టాలీవుడ్ మన్మధుడు అని పిలుచుకునే ‘కింగ్’ నాగార్జున క్లాస్, మాస్, యాక్షన్, సోషియో ఫాంటసీ మరియు భక్తిరస చిత్రాలు అని ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ నవతరం హీరోలకు స్ఫూర్తినిస్తున్నాడు. ఇటీవలే ఆయన నటించిన భక్తిరస చిత్రం ‘శిరిడి సాయి’ విడుదలై సాయి భక్తుల్ని రంజింపజేయగా, ఇంతలోనే ఆయన నటించిన సోషియో ఫాంటసీ సినిమా ‘డమరుకం’ విడుదలకు సిద్దమవుతోంది. ఈ సందర్భంగా ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మీ తదుపరి చిత్రం ‘భాయ్’ మాఫియా నేపధ్యంలో సాగే సినిమానా? అని అడిగిన ప్రశ్నకు నాగ్ సమాధానమిస్తూ ‘ ‘భాయ్’ మాఫియా నేపధ్య సినిమా కాదు, గతంలో వచ్చిన ‘హలో బ్రదర్’ సినిమాని పోలి ఉండే పూర్తి కామెడీ ఎంటర్టైనర్ ‘భాయ్’. నాకు మామూలుగానే మాఫియా అన్నా, వారు చేసే అరాచకాల్ని నా సినిమాలో చూపించాలన్నా నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే అవి సొసైటీలో ఉన్న వారిపై ప్రభావాన్ని చూపుతాయని’ అయన అన్నారు.
ప్రస్తుతం డమరుకం సినిమాకి సంబందించిన గ్రాపిక్స్ పనులు జరుగుతున్నాయి. నాగార్జున దశరథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లవ్ స్టొరీ’ (వర్కింగ్ టైటిల్) సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. ఇది పూర్తవగానే ‘భాయ్’ మరియు ఏ.ఎన్.ఆర్ – నాగ చైతన్యలతో కలిసి నటించే సినిమాలు ప్రారంభమవుతాయి.