ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ‘హరిహర వీరమల్లు’ ఒకటి. ఈ చిత్ర విడుదల గురించి జరుగుతున్న ప్రచారాలు, పెరుగుతున్న ఊహాగానాలు నేపథ్యంలో నిర్మాతలు అధికారిక ప్రకటన విడుదల చేశారు.
గతంలో ప్రకటించిన జూన్ 12వ తేదీకి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చాలా ప్రయత్నించామని.. అయితే ఆ తేదీకి చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురాలేకపోతున్నామని మేకర్స్ తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని మరింత గొప్పగా మలచాలనే ఉద్దేశ్యంతో ప్రతి ఫ్రేమ్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ, అద్భుతమైన చిత్రంగా మలిచే ప్రయత్నంలో చిత్ర యూనిట్ నిమగ్నమై ఉంది. అందుకే మరి కొంత సమయం తీసుకుంటున్నామని చిత్ర యూనిట్ తెలిపింది.
అయితే, సోషల్ మీడియాలో ‘హరి హర వీరమల్లు’ చిత్రం గురించి చాలా వార్తలు వినిపిస్తున్నాయని.. ఏదైనా వార్త తమ అఫీషియల్ హ్యాండిల్ నుంచి వస్తేనే అభిమానులు నమ్మాలని చిత్ర నిర్మాతలు ఈ సందర్భంగా కోరారు. ‘హరిహర వీరమల్లు’ చిత్రం ఒక అద్భుతమైన ప్రయాణం. వందలాది మంది కళాకారులు, సాంకేతిక నిపుణులు కలిసి వెండితెరపై అద్భుతాన్ని సృష్టించడానికి 24 గంటలూ తమ శక్తికి మించి కృషి చేస్తున్నారని మేకర్స్ తెలిపారు. కాస్త ఆలస్యం అయినప్పటికీ, చరిత్ర సృష్టించేందుకు హరిహర వీరమల్లు సిద్ధం అవుతున్నాడని వారు ఈ సందర్భంగా తెలిపారు.
ఇక ఈ సినిమాలో అందాల భామ నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా బాబీ డియోల్, నోరా ఫతేహి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఏ.ఎం రత్నం ఈ చిత్రాన్ని అత్యంత ప్రెస్టీజియస్‌గా భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.