ఈ రోజు తెలుగు సినిమా ఘటోత్కచుడు మరియు ఆరడుగుల ఆజానుబాహుడు అయిన విశ్వ నట చక్రవర్తి ఎస్.వి రంగారావు గారి పుట్టిన రోజు. ఈయన కృష్ణా జిల్లా నూజివీడులో 1918 జూలై 3న జన్మించారు. ఈ యన పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు. ఈయన 1946లో విడుదలైన ‘వరూధిని’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ చిత్రం తర్వాత తెలుగు చలన చిత్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించ దగ్గ పాత్రలు ఎన్నో చేశారు. వాటిలో ముఖ్యంగా కీచకుడు, రావణుడు, నరకాసురుడు, దుర్యోధనుడు, మాంత్రికుడు మరియు ఘటోత్కచుడు లాంటి ఎన్నో రకాల పాత్రలను పోషించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకొన్నారు. తెలుగు చలన చిత్ర రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకోవడమే కాకుండా విలన్ అంటే ఇలానే ఉండాలేమో అనుకునే విధంగా విలన్ పాత్రలను చేశారు. సుమారు 300కు పైగా చిత్రాలలో నటించారు.
ఈయన నటనను మెచ్చి విశ్వ నట చక్రవర్తి, నట సార్వభౌమ మరియు నట శేఖర అనే బిరుదులు ఆయన్ని వరించాయి. ఈయన ‘నర్తనశాల’ సినిమాలో చేసిన కీచకుడి పాత్రకు జకార్తా ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు, ఈ అవార్డు అందుకున్న తొలి తెలుగు నటుడిగా చరిత్రలో నిలిచి పోయారు. ఈయన “మాయ బజార్” లో చేసిన ఘటోత్కచుడు పాత్ర ఆయన తప్ప మరొకరు చేయలేరు అనేలా చేశారు. ఎస్.వి.ఆర్ ఒక్క నటుడిగానే కాకుండా నిర్మాత మరియు దర్శకుడిగా కూడా కొన్ని చిత్రాలను నిర్మించారు. పౌరాణికాల్లోనే కాకుండా సాంఘిక చిత్రాల్లో కూడా నటించి ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు.
ఈ రోజు ఎస్.వి.ఆర్ పుట్టిన రోజు సందర్భంగా 123తెలుగు.కామ్ తరపున ఎస్.వి.ఆర్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.