ప్రస్తుతం ఎస్.ఎస్ రాజమౌళి గారికి ముందు ఉన్న ఎస్.ఎస్ తీసేసి సూపర్ సక్సెస్ఫుల్ రాజమౌళి అంటే కరెక్ట్ గా సరిపోతుంది. అతని స్నేహితులు ముద్దుగా జక్కన్న అంటారు. ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న సక్సస్ఫుల్ డైరెక్టర్ మాత్రం రాజమౌళి గారే. తెలుగు సినిమా క్రియేటివిటీని మరియు కమర్షియల్ రేంజ్ ని పెంచిన దర్శకుడు రాజమౌళి. ఈ రోజు ఆయన పుట్టిన రోజు. విజయేంద్ర ప్రసాద్ గారి దంపతులకి కర్ణాటకలోని రాయ్ చూర్లో 1973 అక్టోబర్ 10న రాజమౌళి జన్మించారు.
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు గారి దగ్గర అసోసియేట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన రాజమౌళి ఆ తర్వాత రాఘవేంద్ర రావు గారి ప్రొడక్షన్ లో ఒక టీవీ సీరియల్ కి దర్శకత్వం వహించారు. ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో ‘స్టూడెంట్ నెం 1’ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమై, మళ్ళీ అదే కాంబినేషన్లో వచ్చిన ‘సింహాద్రి’తో ఇండస్ట్రీ రికార్డ్ సాదించారు. ‘సింహాద్రి’ తర్వాత వరుసగా నితిన్, ప్రభాస్ మరియు రవితేజ లతో సినిమాలు చేసి వరుస విజయాలు అందుకున్న రాజమౌళికి 2009 లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో చేసిన ‘మగధీర’ సినిమా ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. ఈ చిత్రం బాక్స్ ఆఫీసు దగ్గర అప్పటివరకు ఉన్న తెలుగు సినిమా రికార్డులను బద్దలు కొట్టి, కొత్త రికార్డులను సృష్టించింది.
ఆ సమయంలో రాజమౌళి పెద్దన్నయ్య అయిన ఎం.ఎం కీరవాణి గారు ‘ఇకనుంచి రాజమౌళి కెరీర్ మగధీర ముందు వరకు ఒకలా మరియు మగధీర తర్వాత ఒకలా చూస్తారని’ ఆయన అన్నారు. ఆప్పటి నుంచి రాజమౌళి కూడా కొత్త కూత పాయింట్ లతో, కొత్త కథలతో మరియు సరికొత్త ఫిలిం మేకింగ్ టెక్నిక్స్ తో సినిమాలు చేస్తున్నారు. ఈ సంవత్సరం ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘ఈగ’ చిత్రంతో తెలుగువారి సత్తాని దశ దిశలా చాటారు. ఈ సినిమా ఒక్క ఆంద్రప్రదేశ్ బాక్స్ ఆఫీసునే కాక తమిళనాడు బాక్స్ ఆఫీసును కూడా షేక్ చేసింది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని బాలీవుడ్లో కూడా విడుదల చేయనున్నారు.
తెలుగు సినిమా రేంజ్ ని పెంచిన సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి గారికి 123తెలుగు.కామ్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది.