స్టార్ హీరో సూర్య పర్ఫెక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏదైనా సినిమా ఒప్పుకుంటే దాని కోసం వంద శాతం ఎఫర్ట్స్ పెడతారాయన. ఏ పాత్ర చేసినా అందులో పరకాయ ప్రవేశం చేస్తారు. డైలాగ్, సన్నివేశం లేదా మొత్తం కథను ఒక్కసారి నరేట్ చేస్తే ఇట్టే పట్టుకోగల సామర్థ్యం సూర్య సొంతం. అందుకే అయన సినిమాల స్క్రిప్ట్ మీద కుస్తీలు పడరు. డైరెక్టర్ చెప్పింది విని చేసుకుంటూ వెళ్లిపోవడమే. అలాంటి సూర్య తన కొత్త చిత్రం ‘సూరరై పొట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా !’) కోసం మాత్రం స్క్రిప్ట్ మీద చాలా సమయం గడిపారట.
ఏ సినిమాకూ రీడింగ్ సెషన్ అంటూ ప్రత్యేకంగా చేయని ఆయన ఈ సినిమా కోసం మొదటిసారి రీడింగ్ సెషన్స్ చేశారని ఆ చిత్ర దర్శకురాలు సుధా కొంగర చెప్పుకొచ్చారు. మరి సూర్యనే కూర్చోబెట్టి చదివించేలా చేసిన ఆ సినిమా కథలో అంత క్లిష్టత ఏముందో చూడాలంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే. లాక్ డౌన్ కారణంగా ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ ద్వారా ఈ అక్టోబర్ నెలాఖరున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఎయిర్ డెక్కన్ విమానయాన సంస్థ ఫౌండర్, పైలట్ జీఆర్ గోపినాధ్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో తెలుగు సీనియర్ నటుడు మోహన్ బాబు ఓ కీలకపాత్ర చేయడం జరిగింది. అపర్ణ బాలమురళి సూర్యకి జంటగా నటించగా, జీవీ ప్రకాష్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు బాగా ఆకట్టుకోవడంతో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి క్రియేట్ అయింది.