కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు నిర్మాతగా తన తనయుడు మంచు విష్ణు హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ‘దేనికైనా రెడీ’. ఈ సినిమా విడుదలైన రోజు నుంచి సినిమాలో బ్రాహ్మణులను కించపరిచేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని వాటిని తొలగించాలని బ్రాహ్మణులు నిరసనలు తెలుపుతున్నారు. అదీ కాస్త ముదిరి బ్రాహ్మణులు అంతా కలిసి ఈ రోజు మోహన్ బాబు ఇంటి ముందు ధర్నా చేసారు. అలాగే సినిమాలో ఆ సన్నివేశాలను తొలగించాలని వారు డిమాండ్ చేసారు. రేపటి నుంచి ఆ సన్నివేశాలు ఉంటే కోర్టుకి వెళ్తామని వారు నినాదాలు చేసారు. ధర్నా కాస్తా పెద్దది కావడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసారు. ఇప్పటికే కొన్ని బ్రాహ్మణ సంఘాలు ఆ సన్నివేశాలను తొలగించాలని ఫిల్మ్ చాంబర్ కి వినతిపత్రం కూడా సమర్పించారు. స్వతహాగా ఎదుటి వారికి గౌరవం ఇచ్చే డా. మోహన్ బాబు గారు స్పందించి బ్రాహ్మణుల మనోభావాలకు విలువ నిచ్చి ఆ సన్నివేశాలను తొలగిస్తారా లేదా అనే నిర్ణయం కోసం మరికొంత సమయం వేచి చూడాల్సిందే.