స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ తన మొదటి సినిమా ‘గౌరవం’తో ఈ సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ రోజు శిరీష్ తన ట్విట్టర్ లో ఒక ఆసక్తికరమైన విషయాన్ని ట్వీట్ చేశాడు. ఈ యంగ్ హీరో శిరీష్ పేరుతోనే అందరికి పరిచయం కావాలనుకుంటున్నాడట. అందుకే మీడియాతో తన పేరుకు ముందు ఇంటిపేరు ‘అల్లు’ ని రాయవద్దని కోరాడు. ‘మా నాన్న ప్రొడ్యూసర్ గా పరిచయం అయినప్పుడు చాలామంది అరవింద్ పేరుతో వున్నారు. అలాగే అన్నయ్య బన్ని నటుడిగా పరిచయం అయినప్పుడు మరొక పాపులర్ స్టార్ అదే పేరుతో వున్నారు. కావున వారిని అల్లు అరవింద్, అల్లు అర్జున్ గా పిలిచారు. లీగల్ గా నా పేరు శిరీష్ అల్లు కానీ నేను అందరి నటుల మాదిరిగా నా పేరుతో మాత్రమే పరిచయం కావలనుకుంటున్నాను. నన్ను శిరీష్ గానే పరిచయం చేయవలిసిందిగా మీడియాని కోరుతున్నాను. నా రాబోవు సినిమా ‘గౌరవం’ టైటిల్స్ లో శిరీష్ గానే చూస్తారు’ అని ట్వీట్ చేశాడు.
ఈ సినిమాని ఏప్రిల్ మూడవ వారం విడుదల చేయాలనుకుంటున్నారు. యామి గౌతం హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి రాధా మోహన్ దర్శకత్వం వహిస్తున్నాడు. డ్యూయెట్ మూవీస్ బ్యానర్ పై ప్రకాష్ రాజ్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.