ఇండస్ట్రీలో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం అక్కినేని మూడవతరం వారసుడు అక్కినేని అఖిల్ హీరోగా పరిచయం కానున్న సినిమా ఖరారైంది. గతంలో పూరి జగన్నాథ్, త్రివిక్రమ్ లు అఖిల్ మొదటి సినిమాకి డైరెక్ట్ చేయనున్నారనే వార్తలు వినిపించాయి. కానీ ఈ వార్తల్ని అఖిల్ కొట్టిపారేశాడు. ప్రస్తుతం చూస్తుంటే అఖిల్ తన మొదటి సినిమాకి రంగం సిద్దం చేసుకున్నట్టు తెలుస్తోంది.
దేవ కట్టా అఖిల్ తొలి సినిమా డైరెక్ట్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా వచ్చే సంవత్సరం సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటికే సినిమా స్క్రిప్ట్ ఫైనలైజ్ అయ్యింది, ఈ సినిమాని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ సినిమా యాక్షన్ లవ్ స్టొరీ లా ఉంటుందని, ఈ సినిమాలో అఖిల్ తన పాత్ర విషయంలో ఎంతో ఆసక్తిగా ఉన్నాడని తెలుస్తోంది.
అలాగే మేము ఇదివరకు తెలియజేసినట్టు అఖిల్ మనం సినిమాలో ఓ అతిధి పాత్రలో కనిపించనున్నాడు. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య, సమంత, శ్రియ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మనం సినిమాలో అఖిల్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నాడు. ఈ సినిమా 2014లో ప్రేక్షకుల ముందుకు రానుంది.