ఓటీటీ సమీక్ష : AIR- ఆల్ ఇండియా ర్యాంకర్స్ – ఈటీవీ విన్‌లో తెలుగు సిరీస్

ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ : జూలై 3, 2025
స్ట్రీమింగ్‌ వేదిక : ఈటీవీ విన్

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు : హర్ష్ రోషన్, భాను ప్రకాష్, జయతీర్థ, హర్ష చెముడు, రమణ భార్గవ్, చైతన్య రావు, జీవన్ కుమార్, సందీప్ రాజ్, సునీల్, అక్షర
దర్శకత్వం : జోసెఫ్ క్లింటన్
నిర్మాతలు : సందీప్ రాజ్, సూర్య వాసుపల్లి
సినిమాటోగ్రఫీ : ఎస్ఎస్.మనోజ్
సంగీతం : అనివీ
ఎడిటర్ : శ్రీకాంత్ పట్నాయక్ ఆర్

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

‘అనగనగా’ వంటి సూపర్ హిట్ సక్సెస్ తర్వాత ఈటీవీ విన్ ‘AIR – ఆల్ ఇండియా ర్యాంకర్స్’ అనే కొత్త సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ సిరీస్ ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ :

అర్జున్(హర్ష్ రోషన్), ఇమ్రాన్(జయతీర్థ), రాజు(భాను ప్రకాష్) పదో తరగతి పాస్ అయిన ముగ్గురు విద్యార్థులు. వారి తల్లిదండ్రులు వారిని ఐఐటీ కోచింగ్ ఇచ్చే కాలేజీలో జాయిన్ చేస్తారు. అయితే, అందులో చదువును చాలా స్ట్రిక్ట్‌గా చెప్పడంతో మిగతా అంశాలను పూర్తిగా పక్కనబెడతారు. ఈ ముగ్గురు విద్యార్థులు అక్కడి వాతావరణానికి అలవాటు కావడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. దీంతో వారు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తారు. కానీ కొన్ని పరిస్థితులు వారిని అక్కడే ఉండేలా చేస్తాయి. ఒక ఊహించని ఘటన వారిని చిక్కుల్లో పడేస్తుంది. ఇంతకీ వారికి ఎదురయ్యే సమస్యలు ఏమిటి..? వారు ఎలాంటి చిక్కుల్లో ఇరుక్కుంటారు..? అనేది ఈ సిరీస్ కథ.

ప్లస్ పాయింట్స్ :

అనగనగా తర్వాత ఈటీవీ విన్ మరో ఆసక్తికర కంటెంట్‌తో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది. ఇందులోని ఎమోషన్స్ చాలా చక్కగా చూపెట్టారు. ముఖ్యంగా పదో తరగతి పాస్ అయినవారు, ఇంటర్ చదివే వారికి ఈ సిరీస్ బాగా కనెక్ట్ అవుతుంది. ఇదే ఈ సిరీస్‌కు అతిపెద్ద బలంగా నిలిచింది.

ఇక పర్ఫార్మెన్స్‌ల విషయానికి వస్తే.. హర్ష్ రోషన్ ‘కోర్ట్’ చిత్రం తర్వాత మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు. అతడి డైలాగ్ డెలివరీ కూడా ఆకట్టుకుంటుంది. భాను ప్రకాష్, జయతీర్థ అతడికి చాలా బాగా సపోర్ట్ చేశారు. ఈ ముగ్గురి మధ్య వచ్చే సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. కథను ముందుకు తీసుకెళ్లడంలో వీరి పాత్రలు ఉపయోగపడతాయి.

సందీప్ రాజ్, చైతన్య రావు, హర్ష చెముడు తమ పాత్రల్లో మెప్పించారు. టీచర్లుగా వారి పాత్రలు న్యాచురల్‌గా అనిపిస్తాయి. హర్ష చెముడు సీరియస్‌గా ఉంటూనే నవ్వులు పూయిస్తాడు. అటు జీవన్ కుమార్ కూడా కామెడీ పండించాడు.

ఈ సిరీస్‌లోని చాలా సీన్స్ మన జ్ఞాపకాలను గుర్తుచేస్తాయి. కాలేజీలో చదువుకోవడం.. క్లాసులు బంక్ కొట్టడం.. హాస్టల్‌లో దాక్కోవడం. వంటి సీన్స్ కనెక్ట్ అవుతాయి. ముఖ్యంగా అబ్బాయిలకు ఈ సీన్స్ పాతరోజులను గుర్తుకు తెస్తాయి.

మైనస్ పాయింట్స్ :

ఈ సిరీస్‌లో బోలెడన్ని ఎమోషనల్ సీన్స్ ఉన్నప్పటికీ ఇందులో కొన్ని లోపాలు కనిపిస్తాయి. మధ్యలో వచ్చే ఎపిసోడ్స్ కథను చాలా నెమ్మది చేస్తాయి. కథ వేగం పుంజుకుంటుందని అనుకునేలోపు రిపీటెడ్ సీన్స్ కనిపిస్తాయి.

ఈ కథలో ఎక్కవగా ట్విస్టులు లేకపోయినా పర్ఫార్మెన్స్‌లు, ఎమోషన్స్ కథను ముందుకు తీసుకెళ్తాయి. విద్యార్థులు, తల్లిదండ్రుల మధ్య బాండింగ్ మరికొంత బలంగా చూపెట్టాల్సింది. అబ్బాయిల మధ్య బాండింగ్ కూడా ఇంకాస్త్ డెప్త్‌తో చూపెట్టాల్సింది.

చైతన్య రావు పాత్ర చాలా ఆలస్యంగా వస్తుంది. ఆయన పాత్రలో మంచి ప్రాధాన్యత ఉన్నా, దాని ముగించిన తీరు ఆకట్టుకోదు. ఆయన పాత్రను మరికాస్త ఇంపాక్ట్‌తో రాసుకుని ఉంటే క్లైమాక్స్‌కు బలాన్ని చేకూర్చేది.

ఇక ఈ సిరీస్‌లో వచ్చే మోటివేషనల్ స్పీచ్‌లు, చివరి నిమిషంలో వచ్చే సక్సెస్ వంటి అంశాలు అంతగా ఆకట్టుకోవు. ఇలాంటి కొన్ని సీన్స్‌ను మరింత రియలిస్టిక్‌గా రాసుకోవాల్సింది.

సాంకేతిక విభాగం :

దర్శకుడు జోసెఫ్ క్లింటన్ విద్యార్థి జీవితాన్ని ప్రజెంట్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. ప్రెషర్‌ను తట్టుకోవడంలో విద్యార్థులు ఎలాంటి కష్టాన్ని ఎదుర్కొంటారు అనేది మనకు చక్కగా చూపెట్టారు. కేవలం ర్యాంకులు సాధించడమే విద్యార్ధుల ధ్యేయంగా భావించే తల్లిదండ్రులకు ఈ సిరీస్ చక్కటి మెసేజ్ ఇస్తుంది. కొన్ని సన్నివేశాలను ఆయన మరింత పకడ్బందీగా రాసుకోవాల్సింది. ఎస్ఎస్ మనోజ్ సినిమాటోగ్రఫీ వర్క్ నీట్‌గా ఉంది. సింజిత్ యెర్రమిల్లి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎమోషన్స్‌కు తగ్గట్లుగా ఆకట్టుకుంటుంది. అనివీ సంగీతం డీసెంట్‌గా ఉంది. శ్రీకాంత్ పట్నాయక్ ఎడిటింగ్ వర్క్ ఇంకా బెటర్‌గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు :

ఓవరాల్‌గా AIR – ఆల్ ఇండియా ర్యాంకర్స్ ఓ డీసెంట్ సిరీస్‌గా నిలిచింది. మొదటి మూడు ఎపిసోడ్స్ ఎంగేజింగ్‌గా ఉన్నా, ఆ తర్వాత వచ్చే రెండు ఎపిసోడ్స్ కథను స్లో చేశాయి. ఇక చివరి రెండు ఎపిసోడ్స్ ఎమోషనల్‌గా ప్రేక్షకులను మెప్పించాయి. ముగ్గురు కుర్రాళ్లు చక్కటి నటనతో ఆకట్టుకోగా కాలేజీ, హాస్టల్ సన్నివేశాలు మెప్పిస్తాయి. కొన్ని సన్నివేశాలు రియలిస్టిక్‌గా అనిపించకపోవడం, కొన్ని పాత్రలను పక్కాగా డిజైన్ చేయకపోవడం మైనస్. కాలేజీ, హాస్టల్స్‌లో ఉండి చదువుకున్న వారికి ఈ సిరీస్ చూస్తే తమ పాత రోజులు గుర్తుకు రావడం ఖాయం.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team 

Exit mobile version