ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సందడి చేసేందుకు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ‘కూలీ’గా రెడీ అయ్యాడు. ఈ సినిమాను దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించడంతో ఈ మూవీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ నటిస్తుండటంతో ఈ మూవీలో వారి పాత్రలు ఎలా ఉండబోతున్నాయా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.
కాగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ఓ కేమియో పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఆయన పాత్ర ఎప్పుడు, ఎలా ఎంట్రీ ఇస్తుందా.. ఎలాంటి పాత్రలో ఆయన కూలీలో కనిపిస్తాడా అని అభిమానులు ఆతృతగా చూస్తున్నారు. అయితే, తాజాగా ఆయన ఈ సినిమా కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారనే అంశంపై నెట్టింట చర్చ సాగుతోంది. కూలీ చిత్రంలో తన పాత్ర కోసం అమీర్ ఖాన్ నాలుగు రోజులు షూటింగ్ చేశాడు.
ఇక ఈ సినిమాలో తన పాత్ర కోసం అమీర్ ఏకంగా రూ.20 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది. రజినీకాంత్ సినిమా అనగానే ఆయన ఈ పాత్రకు ఓకే చెప్పానని ఇటీవల ప్రకటించారు. దీంతో ఆయన ఈ సినిమాలో ఎలాంటి ఇంప్రెషన్ వదులుతాడా అనేది ఆసక్తికరంగా మారింది.