ప్రకాష్ రాజ్ దర్శకత్వం వహిస్తున్న ‘ఉలవచారు బిర్యాని’ సినిమా ఆడియో ఈరోజు ఘనంగా విడుదలైంది. అతిరధుల సమక్షంలో మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా గారిని ఈ చిత్ర బృందం సత్కరించడం ఈ వేడుకకే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కే. రాఘవేంద్ర రావు, డి రామానాయుడు, కీరవాణి, మణిశర్మ వంటి ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు.
ఈ సందర్భంలో ప్రకాష్ రాజ్ ఈ సినిమా సంగీతం గురించి మాట్లాడుతూ “మా సినిమాకు ఇళయరాజా గారు పనిచెయ్యడం మాకు గర్వకారణం. ఆయన
ఆశిస్సులు మమ్మల్ని ఎప్పుడూ ముందుకు నడిపిస్తాయని నమ్ముతాను. నేను దర్శకుడిగా కొత్త ఇన్నింగ్స్ ని ఆస్వాదిస్తున్నా. ఇది నా మూడవ సినిమా. సినిమా సినిమాకూ నాలో నమ్మకం పెరుగుతుంది. కొన్ని విషయాలు మా కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకోవడం మరింత ఆనందంగా వుంది” అని తెలిపారు.
తనను ఇలా సత్కరించనున్నట్లు తనకు తెలియదని, ఒక్కసారిగా ఇది చూసి ఆశ్చర్యపోయానని ఇళయరాజా తెలిపారు. తన ప్రతీ పాటా ఒక కష్టానికి ప్రతిరూపమని, ఒక పాట మరొక పాటలా వుంటే అది అసలు పాటే కాదని తెలిపారు. నేను పాటలను కాపీ కొట్టను. ఎంతోమంది దర్శకులు నా దగ్గరకొచ్చి సూపర్ హిట్ సాంగ్స్ లాంటివి ఇమ్మంటారు. కానీ అలా నేను చెయ్యలేను.
ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, స్నేహ, తేజాస్ మరియు సముఖ్య ప్రధాన పాత్రధారులు. ప్రకాష్ రాజ్ దర్శకుడు. కె.ఎస్ రామారావు నిర్మాత. మే నెలలో ఈ సినిమా విడుదలకానుంది.