దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్ని అంటాయి. సినీ పరిశ్రమలో సైతం ఈ దీపాల పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే, ఇలాంటి ఆనందరకమైన సమయంలో బాలీవుడ్ సినీ పరిశ్రమలో ఓ విషాదం చోటు చేసుకుంది. బాలీవుడ్‌లో కామెడీ పాత్రలతో ప్రఖ్యాతి పొందిన ప్రముఖ నటుడు గోవర్ధన్ అస్రాని 84 ఏళ్ల వయసులో ముంబైలోని ఆసుపత్రిలో మంగళవారం (అక్టోబర్ 20, 2025) మరణించారు. ఆయన ఇటీవల కొన్ని ఆరోగ్య సమస్యల కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
అస్రాని 1960ల కాలంలో బాలీవుడ్‌లో అడుగుపెట్టి 350కి పైగా చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా ‘షోలే’లో జైలర్ పాత్రతో, ‘బావర్చి’, ‘చుప్కే చుప్కే’, ‘అభిమాన్’ వంటి చిత్రాల్లో తన వినోదాత్మక నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాధించారు. ఆయన తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందారు.
ఆయన మరణ వార్తతో సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. అభిమానులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆయన మృతిపట్ల శ్రద్ధాంజలి తెలిపారు.