అతని పేరు సూర్య, బెజవాడలోని ఆటోనగర్ అతని అడ్డా. అక్కడ నివసించే సూర్యకి ఆటో నగరే ప్రపంచం. ఎవరైనా ఆ ఏరియాలో వారికి ఎవరైనా అశాంతి కలిగింగాలని ప్రయత్నించారో వారి భరతం పడతాడు. అలాంటి ఓ అబ్బాయి జీవితంలోకి ఓ అందమైన అమ్మాయి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత వారి ప్రేమ ఎలాంటి పరిణామాలని ఎదుర్కొంది? వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది? ఇంతకీ సూర్యకి ఆటోనగర్ తో ఉన్న సంబంధం ఏమిటి? అనే విషయాలు తెలియాలంటే ‘ఆటోనగర్ సూర్య’ సినిమా వచ్చేంత వరకూ ఎదురు చూడాల్సిందే. మన యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్యనే ఆ ఆటోనగర్ సూర్య, మన అందాల భామ సమంతానే ఆ అందమైన అమ్మాయి.
విభిన్న కథా చిత్రాలను తీసే దేవకట్టా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రెండు పాటల మినహా చిత్రీకరణ పూర్తయినది. ఆర్.ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్లో కె. అచ్చిరెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని నవంబర్ 9న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. నాగ చైతన్య ఈ సినిమాతో మాస్ హీరోగా ఫుల్ క్రేజ్ తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.