కామెడీ చిత్రాలకు మారు పేరుగా మారిన హీరో కామెడీ కింగ్ అల్లరి నరేష్. ఈ ఆగష్టులో ప్రేక్షకులకు కామెడీ పంచడానికి అల్లరి నరేష్ ‘సుడిగాడు’ చిత్రంతో వస్తున్నాడు. ఈ చిత్రంలో అల్లరి నరేష్ సడన్ స్టార్ గా కనిపిస్తాడు, ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు తమకో స్పెషల్ టైటిల్ ఇచ్చుకునేందుకు ఉత్సాహపడుతున్నారు దానికి సెటైర్ గా ఉన్నట్లుంది ఈ టైటిల్. ఈ చిత్రంలో ‘పోకిరి’లో మహేష్ బాబు చెప్పిన పంచ్ డైలాగ్స్, రజనీకాంత్ ‘శివాజీ’ సినిమాలో రెండు చేతులతో సంతకాలు పెట్టడం, ‘భారతీయుడు’ చిత్రంలో కమల్ హాసన్ కనిపించిన ఫ్రీడం ఫైటర్ లాగా మరియు ‘మగధీర’ చిత్రంలో రామ్ చరణ్ కనిపించిన విధంగా ఇంకా ఎంతో మంది హీరోల ఫేమస్ గెటప్స్ ని పేరడీ చేశారు. మోనాల్ గజ్జర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని డి. చంద్రశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు.
ఈ చిత్ర దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘ ఏమీలేని వాడు హీరోగా ఎదగడం మనం చాలా సినిమాల్లో చూశాము. ఇది కూడా అలాంటి సినిమానే కానీ ఇది అల్లరి నరేష్ మార్క్ ఉన్న పూర్తి కామెడీ ఎంటర్టైనర్. అల్లరి నరేష్ ఈ చిత్రంలో సుమారు 20 పాత్రలను పోషించారు మరియు ప్రతి సన్నివేశం చాలా అద్భుతంగా వచ్చింది’ అని ఆయన అన్నారు. ఈ సినిమాలో అతను చేసే ప్రతి సన్నివేశం ప్రేక్షకుల చేత నవ్వుల పువ్వులు పూయిస్తుంది మరియు ‘సడన్ స్టార్’ గా అల్లరి నరేష్ ని స్క్రీన్ మీద ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం.