సినిమాలో హీరో, హీరోయిన్, విలన్. హీరోయిన్ తో ఎదో ఒక సంబంధం వల్ల విలన్ హీరోని చంపేయడం హీరో చనిపోయి నరకానికి వెళ్లి అక్కడ యముడిని ముప్పు తిప్పలు పెట్టి మళ్ళీ భూమి మీదకి వచ్చేయడం. ఇలాంటి కాన్సెప్ట్స్ తో గతంలో ఎక్కువ సినిమాలు వచ్చాయి. మళ్ళీ ఈ ట్రెండ్ ఇప్పుడు ఊపందుకుంటోంది. ప్రస్తుతం టాలీవుడ్లో భూమికి – యమపురికి మధ్య నడిచే కథాశంతో తెరకెక్కిన రెండు సినిమాలు ‘యమహో యమః’ మరియు ‘యముడికి మొగుడు’.
అందులో సాయి రామ్ శంకర్- పార్వతి మెల్టన్ హీరోహీరోయిన్లుగా, శ్రీహరి యముడి పాత్రలో తెరకెక్కిన సినిమా ‘యమహో యమః’. ఈ సినిమా విజయం సాయిరామ్ శంకర్ కెరీర్ కి చాలా కీలకం కానుంది. అలాగే కామెడీ కింగ్ అల్లరి నరేష్ – రిచా పనాయ్ హీరో హీరోయిన్లుగా, సాయాజీ షిండే యముడిగా తెరకెక్కిన సినిమా ‘యముడికి మొగుడు’. ‘సుడిగాడు’ లాంటి హిట్ సినిమా తర్వాత వస్తున్న ఈ సినిమా పై అంచనాలున్నాయి.
ఈ రెండు సినిమాలు ఒకే వారం గ్యాప్ లో బాక్స్ ఆఫీస్ పై దాడి చేయనుండడం మరో విశేషం. ముందుగా సాయిరామ్ శంకర్ ‘యమహో యమః’ తో డిసెంబర్ 14న తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఆ తర్వాత డిసెంబర్ 22న నరేష్ ‘యముడికి మొగుడు’గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ రెండు సినిమాల్లోని ఏ యమధర్మ రాజు బాక్స్ ఆఫీస్ రారాజుగా నిలుస్తాడో చూడాలి మరి.