యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందుతున్నారు. 14 మంది మార్షల్ ఆర్ట్స్ నిపుణులు ఆయనకు శిక్షణ ఇస్తున్నారు. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ మరియు ఇతర యుద్ధ విద్యలను ఆయన నేర్చుకుంటున్నారట. దీని కోసం ఆయన కఠిన కసరత్తులు చేస్తున్నారని సమాచారం. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాద్.. విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్ అనే చిత్రాన్ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది రామ్ తో ఇస్మార్ట్ శంకర్ తో సూపర్ హిట్ అందుకున్న అనంతరం పూరి విజయ్ తో ఈ చిత్రాన్ని చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రంలో విజయ్ ని ఒక ప్రొఫెషనల్ ఫైటర్ గా చూపించనున్నాడు పూరి.
ఈనెల చివరి వారంలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం కలదు. విజయ్ పూరి కాంబినేషన్ లో వస్తున్న మొదటి చిత్రం ఫైటర్ పై పరిశ్రమలో భారీ అంచనాలున్నాయి. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై ఛార్మి, పూరి స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక విజయ్ నటించిన తాజా చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్ వచ్చే నెల 14న లవర్స్ డే కానుకగా విడుదల కానుంది. దర్శకుడు క్రాంతి మాధవ్ తెరకెక్కించిన వరల్డ్ ఫేమస్ లవర్ టీజర్ ఇటీవల విడుదలై విశేష ఆదరణ దక్కించుకుంది.