నటసింహం నందమూరి బాలకృష్ణ మరియు రాకింగ్ స్టార్ మంచు మనోజ్ కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ ‘ఊ కొడతారా ఉలిక్కి పడతారా’. ఈ రోజు సెన్సార్ కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ వారు యు/ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ విషయాన్ని లక్ష్మీ మంచు తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ శుక్రవారం (జూలై 27న) ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చిత్ర ప్రమోషన్స్ కూడా చాలా జోరుగా సాగుతున్నాయి. ఇటీవలే విడుదల చేసిన ఈ చిత్ర ట్రైలర్ కి మంచి స్పందన లబిస్తోంది. దీక్షా సేథ్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో లక్ష్మీ మంచు, పంచి బోరా, ప్రభు, సాయి కుమార్, సుహాసిని మరియు సోనూ సూద్ ప్రముఖ పాత్రలు పోషించారు. శేఖర్ రాజా దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి బోబో శశి సంగీతం అందించారు. మంచు ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై లక్ష్మీ మంచు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.