భట్టి విక్రమార్క చేతుల మీదుగా ‘పిఠాపురంలో’ టైటిల్ పోస్టర్ ఆవిష్కరణ

భట్టి విక్రమార్క చేతుల మీదుగా ‘పిఠాపురంలో’ టైటిల్ పోస్టర్ ఆవిష్కరణ

Published on Nov 11, 2025 8:00 AM IST

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేతుల మీదుగా ‘పిఠాపురంలో’ సినిమా టైటిల్ పోస్టర్‌ను లాంచనంగా ఆవిష్కరించారు. ‘ప్రేయసి రావే’ ఫేమ్‌ మహేష్‌చంద్ర దర్శకత్వంలో, దుండిగల్ల బాలకృష్ణ, ఆకుల సురేష్‌ పటేల్‌, ఎఫ్‌ఎం మురళి (గోదారి కిట్టయ్య) సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి ‘అలా మొదలైంది’ అనే ఉపశీర్షిక ఉంది.

పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ఈ సినిమా కాన్సెప్ట్ ఒక మంచి సందేశాత్మక చిత్రంగా ఉందని, ముఖ్యంగా యువతరం కుటుంబ సమేతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా ఎదగాలి అనే బలమైన సందేశం ఇందులో ఉందని పేర్కొన్నారు. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించాలని ఆయన కోరారు.

ముఖ్య పాత్ర పోషించిన డా. రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ, సమాజంలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులపై దర్శకుడు మహేష్‌చంద్ర అద్భుతంగా ఈ కథను డీల్ చేశారని తెలిపారు. ‘ఆ నలుగురు’, ‘మీ శ్రేయోభిలాషి’ వంటి తన సందేశాత్మక చిత్రాల సరసన నిలిచే విధంగా యువతరాన్ని ఆకట్టుకునే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయని చెప్పారు. నటుడు పృధ్వీరాజ్‌ మాట్లాడుతూ, ఇది మూడు కుటుంబాల కథ అని, ఇంటర్నెట్ యుగంలో తల్లిదండ్రులపై గౌరవం కనబరచని యువతకు ఈ చిత్రం కనువిప్పు కలిగిస్తుందని పేర్కొన్నారు.

దర్శకుడు మహేష్‌చంద్ర మాట్లాడుతూ, తన తొలి చిత్రం ‘ప్రేయసి రావే’ మాదిరిగానే ‘పిఠాపురంలో’ కూడా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది ముగ్గురు తండ్రుల కథలా అనిపిస్తూనే, మూడు జంటల మధ్య నడిచే కథ అని వివరించారు. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉందని, వచ్చే నెలలో విడుదల చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. డా. రాజేంద్రప్రసాద్‌, పృధ్వీరాజ్‌, కేదార్‌ శంకర్‌, మణిచందన, సన్నీ అఖిల్ తదితరులు ఇందులో ప్రధాన తారాగణం.

తాజా వార్తలు