తెలుగు సినిమా ప్రపంచంలో అత్యద్భుతమైన నటులలో అక్కినేని నాగేశ్వర రావు ఒకరు. ప్రస్తుతం మన సినిమాల్లో వస్తున్న చాలా విషయాలను చూసి ఆయన ఎక్కువ ఆశ్చర్యానికి గురవుతున్నారు. అందులో ముఖ్యంగా ఈ మధ్య తెలుగు సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తున్న వల్గారిటీ. ఇటీవలే జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన సంఘటనని చెప్పారు.
ఎ.ఎన్.ఆర్ తన తనయుడు నాగార్జునతో మాటాడుతూ ‘ నేను చాలా రోజుల నుంచి నాగార్జున సినిమాలు చూస్తున్నాను. కొన్ని సినిమాల్లో కొంత వల్గారిటీ ఉండటం చూసాను. ఆ విషయం గురించి నాగార్జునని అడిగితే సమాధానమిస్తూ ‘ నాన్నా మీకు మోడ్రన్ ఫిల్మ్స్ గురించి పెద్దగా తెలియదు, అలాగే ప్రస్తుతం మిగతా సినిమాల్లో ఏం జరుగుతోందో కూడా తెలియదు, వాళ్ళు ఇంకా ఘోరంగా తీస్తున్నారు వారితో పోల్చుకుంటే నేను చాలా బెటర్. ప్రస్తుతం ఉన్న బిజినెస్ పరంగా, అలాగే కాంపిటీషన్ పరంగా నేను చేస్తున్నాను’ అని చెప్పడంతో నేను ఉన్న టైంకి ఇప్పటికీ పరిస్థితులు చాలా మారి పోయాయని తెలుసుకున్నాని’ అన్నారు.
ఎ.ఎన్.ఆర్ త్వరలోనే విక్రం కుమార్ దర్శకత్వంలో అక్కినేని వంశం నుంచి వస్తున్న మూడు తరాల సినిమా ‘మనం’ లో నటించనున్నారు. ఈ మల్టీ స్టారర్ సినిమాలో నాగార్జున, నాగ చైతన్యల సరసన శ్రియ, సమంత నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించనున్న ఈ సినిమా సమ్మర్ తర్వాత సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది.