OG : చివరి నిమిషంలో బాంబ్ పేల్చిన తెలంగాణ హైకోర్టు.. అయోమయంలో ఫ్యాన్స్..!

OG

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఓజీ’ మరికొద్ది గంటల్లో థియేటర్లలోకి వచ్చేస్తోంది. దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ ఫ్యాన్ బాయ్ మూవీలో పవన్ కళ్యాణ్‌ను అభిమానులు ఎలా అయితే చూడాలనుకుంటున్నారో, అలాగే ప్రెజెంట్ చేస్తున్నాడు ఈ డైరెక్టర్. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్స్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇక ప్రీమియర్ షోలకు అప్పుడే హౌజ్‌ఫుల్ బోర్డులు పడుతున్నాయి.

అయితే, సినిమా మరికొద్ది గంటల్లో వచ్చేస్తుందన్న సమయంలో తెలంగాణ హైకోర్టు ఓ బాంబ్ పేల్చింది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన టికెట్ ధరల పెంపుకి సంబంధించిన జీవోను సవాల్ చేస్తూ మహేశ్ యాదవ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు. దీంతో ఈ జీవోను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇది చిత్ర యూనిట్‌కు పెద్ద సమస్యే అని చెప్పాలి. ఇప్పటికే ప్రీమియర్ షోలు, తొలి రోజు టికెట్లు బుకింగ్ అయిపోయాయి.

ప్రీమియర్ టికెట్ రేటు రూ.800, ఫస్ట్ డే సింగిల్ స్క్రీన్స్‌లో రూ.277/-, మల్టీప్లెక్స్‌లలో రూ.445/- గా నిర్ణయిస్తూ తెలంగాణ సర్కార్ జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు తెలంగాణ హైకోర్టు ఈ జీవోను రద్దు చేయడంతో అభిమానులు అయోమయంలో పడ్డారు. చివరి నిమిషంలో ఈ జీవో రద్దు కావడంతో ఇది సినిమా కలెక్షన్స్‌పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Exit mobile version