ఆయన ప్రశంశలు ఎప్పటికీ మర్చిపోలేను : సుదీప్


టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసిన ‘ఈగ’ చిత్రం ఇటీవలే విడుదలై ఎంతో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. కన్నడ హీరో సుదీప్ ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకు విలన్ గా పరిచయమయ్యారు. తన నటన ద్వారా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకున్నాడు.

ఓ ప్రముఖ న్యూస్ పేపర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో లేని ‘ఈగ’ను ఊహించుకొని ఎలా నటించారు? అని అడిగిన ప్రశ్నకు సుదీప్ మాట్లాడుతూ ” అలా లేని ఈగని ఊహించుకొని చేయడానికి ఎంతో కష్టపడ్డాను. ముందుగా నేను ఒక స్టార్డడమ్ ఉన్న హీరోనని మరిచిపోయి దర్శకుడు చెప్పినట్టు చేశాను. ప్రేక్షకుడు సినిమా చూసి బయటకి రాగానే పాత్రని మర్చిపోకుండా ఎప్పుడైతే ఆ పాత్రని గుర్తు పెట్టుకుంటాడో అప్పుడే ఒక నటుడు పూర్తి సంతృప్తి చెందుతాడు. ఈ చిత్రం చూసిన తర్వాత నా నటనకు ఎంతో మంది అభినందనలు తెలిపారు కానీ రాజమౌళి గారు అన్న ఆ ఒక్క మాటే నాకు వెయ్యి అవార్డులతో సమానం. రాజమౌళి గారు ఏమన్నారంటే ‘ నాకు వయసైపోయి నేను నా జ్ఞాపకాల్లోకి వెళ్ళినప్పుడు నేను సుదీప్ తో ఒక సినిమా చేశాను అని గర్వంగా చెప్పుకునే ఒక తీపి గుర్తుగా నిలిచిపోతుంది’ అని ఆయన అన్న మాటలు నాకు ఎంతో ఆనందాన్ని కలిగించాయని” ఆయన అన్నారు.

ఈ చిత్రం తర్వాత సుదీప్ ని తమ సినిమాలో నటించమని చాలా మంది తెలుగు నిర్మాతల అడుగుతున్నారు, కానీ సుదీప్ ఇంకా ఏ సినిమాకు అంగీకారం తెలపలేదు. సుదీప్ కన్నడంలో నటించిన ‘కిచ్చ హుచ్చ’ చిత్రాన్ని తెలుగులో ‘కిచ్చ’ పేరుతో అనువదిస్తున్న ఈ చిత్రాన్ని ఆగష్టులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Exit mobile version