యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తల స్టైల్ మార్చి తీసిన ‘బాద్షా’ సినిమా గత శుక్రవారం విడుదలై మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకోవడమే కాకుండా ఆంధ్ర, తమిళనాడు, కట్నాటక, ఓవర్సీస్ అని తేడా లేకుండా బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సందర్భంగా నిన్న రాత్రి ఈ చిత్ర బృందం సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేసారు. ఈ సక్సెస్ మీట్ కార్యక్రమానికి ఎన్.టి.ఆర్, కాజల్, శ్రీను వైట్ల, బండ్ల గణేష్, కెవి గుహన్, గోపీ మోహన్, విజయ్, దిల్ రాజు, రామజోగయ్య శాస్త్రి తదితర చిత్ర బృందం హాజరయ్యింది.
నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ ‘ ముందుగా చెప్పినట్టుగానే ఈ సినిమా నందమూరి తారక రామారావు గారి కెరీర్లో చిరస్థాయిగా నిలిచిపోయే సినిమా అయ్యినందుకు చాలా ఆనందంగా ఉంది. బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చినందుకు శ్రీను వైట్ల అన్నయ్యకి నా ధన్యవాదాలు. ఆలాగే ఈ సినిమా అన్ని ఎరియాల్లోనూ కలెక్షన్స్ విషయంలో రికార్డ్స్ బద్దలు కొడుతోందని’ అన్నాడు.
డైరెక్టర్ శ్రీను వైట్ల మాట్లాడుతూ ‘ మేము ఒక సంవత్సరం కష్టపడి తీసిన ‘బాద్షా’ సినిమాని ఇంత పెద్ద వవిజయం చేసిన ప్రేక్షకులకి నా ధన్యవాదాలు. ఎన్.టి.ఆర్ గారు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. అసలు ఒక స్టార్ హీరో అనే గర్వం లేకుండా పూర్తిగా నేను చెప్పినట్టు చేసారు. అలాగే బంతిపూల జానకి సాంగ్ ని -10 డిగ్రీల చలిలో తీసాము. నేనే చలికి తట్టుకోలేక కార్లలోకి పరిగెత్తే వాన్ని కానీ తారక్ మాత్రం ఎంతో పట్టుదలతో అదే చలిలో ఆ పాటని కంప్లీట్ చేసాడు. ఆ విషయంలో తారక్ కి హాట్సాఫ్ చెప్పాలని’ అన్నాడు.
హీరో ఎన్.టి.ఆర్ మాట్లాడుతూ ‘ ప్రస్తుతం నేను బాద్షా సినిమా హిట్ అయిన ఆనందంలో తేలియాడుతున్నాను. ఈ క్షణం ఇలాగే ఆగిపోతే ఎంత బాగుంటుందా అని అనిపిస్తోంది. శ్రీను వైట్ల అన్నయ్య మొత్తం 6 స్టోరీలు చెప్పాడు. మొదట ఒక స్టొరీ చెప్తే బాగుంది చేద్దాం అన్నాను మళ్ళీ వెళ్లి వచ్చి వేరే కథ చెప్పేవాడు, ఇలా 5 కథలు చెప్పాడు చివరిగా ‘బాద్షా’ కథ చెప్పాడు. అప్పుడు నేను ఇదన్నా చేస్తున్నామా అంటే ఇదే చేస్తున్నాం అని అన్నాడు. సెట్స్ పైకి వచ్చాక నాకు అర్థమయ్యింది నాకు చెప్పిన అన్ని స్టోరీల్లోని బెస్ట్ పాయింట్స్ అన్నీ ఈ సినిమాలో పెట్టాడని, అలాగే నాకు శ్రీను అన్నయ్యని చూస్తే జంధ్యాల గారు గుర్తొస్తారు. ఆయనంత కామెడీ శ్రీను సినిమాల్లో ఉంటుంది. ఇక బండ్ల గణేష్ గురించి చెప్పాలి. ఆయన ఎప్పుడూ తదాస్తు దేవతల్ని తనతో పెట్టుకొని తిరుగుతూ బ్లాక్ బస్టర్ బాద్షా అంటుండేవాడు వాడు అందుకే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యింది. ఎప్పటి నుంచో కెవి గుహన్ తో పనిచెయ్యాలనుకుంటున్నాను అది ఈ సినిమాతో తీరింది. ఈ సినిమాకోసం పనిచేసిన మిగతా వారందరూ ఎంతో కష్టపడి పనిచేసారు వారందరికీ నా ధన్యవాదాలని’ ఆన్నాడు.
అలా వెళ్ళిపోతున్న ఎన్.టి.ఆర్ ని ఓ మీడియా మిత్రుడు ప్రస్తుతం రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాల గురించి, ఫ్లెక్సీల విషయంలో తలెత్తిన వివాదం గురించి ప్రశ్నించగా ‘ మీరు అలాంటి ప్రశ్నలు అడగటానికి ఇది సరైన సమయం కాదు. ప్రస్తుతం నేను బాద్షా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాను, ఎంజాయ్ చేయనివ్వండి కానీ ఒక్కటి నేను నందమూరి తారక రామారావు గారి మనవన్ని ఆయన రక్తం నాలో ప్రవహిస్తోంది కాబట్టి నేను ఎప్పుడూ అయన పార్టీ కోసమే పని చేస్తానని ఈ సభా ముఖంగా చెబుతున్నానని’ ఎన్.టి.ఆర్ సమాధానమిచ్చాడు.