వింటేజ్ విలేజ్ లవ్ స్టోరీతో ఆకట్టుకున్న ‘శ్రీ చిదంబరం’ టీజర్

Sri Chidambaram

శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో, శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వినయ్ రత్నం దర్శకత్వంలో రూపొందిన ‘శ్రీ చిదంబరం’ చిత్ర టీజర్ ఆవిష్కరించారు. వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట ప్రధాన జంటగా నటించిన ఈ టీజర్ లాంచ్ కార్యక్రమానికి హీరో సత్యదేవ్‌తో పాటు దర్శకులు వశిష్ట, వెంకటేష్ మహా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

టీజర్ చూస్తే వింటేజ్ విలేజ్ వాతావరణంలో సాగే అందమైన ప్రేమకథ స్పష్టంగా కనిపిస్తోంది. హీరోకు అసలు పేరుకన్నా “చిదంబరం” అనే పేరే ఊరంతా ఎందుకు పిలుస్తుంది? ఆయన ఎప్పుడూ కళ్లద్దాలు ఎందుకు ధరిస్తుంటారు? వంటి ఆసక్తికర ప్రశ్నలను ముందుంచి, సినిమాపై క్యూరియాసిటీ పెంచే విధంగా కట్ చేశారు. శుభ్రమైన విజువల్స్, హృదయాన్నికట్టి పడేసే మ్యూజిక్ టోన్ టీజర్‌కు ప్రత్యేక మెరుగులుగా నిలిచాయి.

టీజర్ లాంచ్‌లో సత్యదేవ్ మాట్లాడుతూ, “‘క’తో విజయం సాధించిన గోపాలకృష్ణ రెడ్డి గారి ప్యాషన్ నిజంగా అరుదు. ‘మంచి కథ ఆడియెన్స్‌కి చేరాలి’ అనేది ఆయనకు ప్రాధాన్యం. వినయ్ రత్నం కథను అద్భుతంగా మలిచారు. వంశీ నటన మెచ్యూర్‌గా ఉంది, సంధ్యా సహజత్వం బాగా కనపడింది. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. త్వరలో ‘శ్రీ చిదంబరం’ మేకర్స్ అనే పేరుతో కూడా గర్వంగా వినిపిస్తుంది” అన్నారు. దర్శకుడు వశిష్ట యంగ్ టీమ్ చేసిన టీజర్ చాలా బాగుందని, నిర్మాత గోపాలకృష్ణ రెడ్డి ప్యాషన్‌కు అభినందనలు తెలుపుతూ టీమ్‌కు మంచి పేరు రావాలన్నారు. వెంకటేష్ మహా, “నా రైటర్స్ క్లబ్ నుంచి వచ్చిన వినయ్ రత్నం ఇలా మంచి సినిమా తీస్తుండడం గర్వంగా ఉంది. మారేడుమిల్లి లొకేషన్స్ అద్భుతంగా కళ్లముందు నిలిచాయి. వంశీ, సంధ్య సహజ నటన ఆకట్టుకుంది. ఈ సినిమా హిట్ అయితే మరిన్ని మంచి ప్రయత్నాలు వెలుగులోకి వస్తాయి” అని అన్నారు.

నిర్మాత గోపాలకృష్ణ రెడ్డి మాట్లాడుతూ, “వినయ్ చెప్పిన కథ వెంటనే నచ్చింది. ప్రొడక్షన్ బాధ్యతలను మా పిల్లలే చూసుకున్నారు. గ్లామర్‌ కంటే గ్రామర్‌కే ప్రాధాన్యం ఇచ్చి కొత్త ఆర్టిస్టులతో నిజాయితీగా సినిమా తీశాం. మా తరఫున వంద శాతం ప్రయత్నం చేశాం; ఇప్పుడు ఈ సినిమాను మీడియా, ప్రేక్షకులే ముందుకు తీసుకెళ్లాలి” అన్నారు. హీరో వంశీ తుమ్మల తన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ, “రాజమండ్రి నుంచి యాక్టర్ కావాలనే నా కల ఈ రోజు నెరవేరింది. స్కూల్‌ రోజుల నుంచే వినయ్‌తో కలిసి సినిమా కలలు కనాం. షార్ట్ ఫిల్మ్స్ నుంచి ఇక్కడికి రావడం వరకు మా టీమ్ ఇచ్చిన సపోర్ట్‌కు థాంక్స్. టీజర్‌కు వచ్చిన పాజిటివ్ వైబ్స్ మమ్మల్ని మరింత ఉత్సాహపరుస్తున్నాయి” అన్నారు. దర్శకుడు వినయ్ రత్నం, “ఈ కథతో రెండేళ్లు తిరిగాను. నా ఆర్టిస్టులతోనే చెప్పాలనుకున్న కథ ఇది. క్రౌడ్ ఫండింగ్ కూడా ఆలోచించాం. చివరకు వినీషా గారు, గోపాలకృష్ణ రెడ్డి గారు అండగా నిలిచారు. మన పని మీద నిజాయితీ ఉంటే యూనివర్స్ సహాయం చేస్తుందని ఈ ప్రయాణమే చెబుతోంది. ‘కేరాఫ్ కంచరపాలెం’ నాకు పెద్ద ప్రేరణ. టీజర్ నచ్చితే అందరికీ చెప్పండి” అని అన్నారు.

మొత్తానికి, ‘శ్రీ చిదంబరం’ టీజర్ సింపుల్ అండ్ సోల్ఫుల్ ఫీల్‌తో, గ్రామీణ ప్రేమకథ సుగంధంతో, క్యూరియాసిటీను రేపే మిస్టరీ ఎలిమెంట్స్‌తో ప్రామిసింగ్‌గా కనిపిస్తోంది. విడుదల కోసం సినిమా ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version