టాలీవుడ్ యంగ్ హంక్ రానా దగ్గుబాటి హీరోగా నటించిన కమర్శియల్ ఎంటర్టైనర్ ‘కృష్ణం వందే జగద్గురుమ్’ సినిమా విడుదల తేదీపై వస్తున్న పలు వార్తలకి ముగింపు ఇచ్చారు. ఈ సినిమాని నవంబర్ 30న విడుదల చేయనున్నారు. నిన్న రాత్రి ఈ సినిమాని నవంబర్ 9న విడుదల చేయాలని అనుకున్నారు కానీ ఈ రోజు ఉదయం డిస్ట్రిబ్యూటర్స్ మరియు ఫైనాన్సియర్స్ తో సంప్రదింపులు జరిపిన తర్వాత చివరగా ఈ సినిమాని నవంబర్ 30న విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
నాగార్జున నటించిన ‘డమరుకం’ ఈ నెల 9న విడుదలకు సిద్దమవుతోంది, అలాగే 23న కూడా పలు సినిమాలు విడుదల కానుండడంతో ఈ చిత్ర ప్రొడక్షన్ టీం ఈ సినిమాని నవంబర్ 30న విడుదల చేయడం సరైన సమయం అని భావించి ఆ సమయాన్ని ఎంచుకున్నారు. రానా, నయనతార జంటగా నటించిన ఈ సినిమాకి క్రిష్ దర్శకత్వం వహించగా మణిశర్మ సంగీతం అందించారు.
ఇకనైనా విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేకుండా అనుకున్నట్టుగానే ఈ నెలలోనే విడుదల చేస్తారని ఆశిద్దాం.