దీప్శిక, సూర్య వశిష్ట ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కొత్త చిత్రం “రమణి కళ్యాణం” టైటిల్‌ను చిత్ర బృందం ఘనంగా ఆవిష్కరించింది. విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టైటిల్ లుక్‌ను కిరణ్ అబ్బవరం, వశిష్ట, విజయ్ ఆంటోని, జి.వి. ప్రకాశ్ కుమార్, సామ్ సి.ఎస్, రంజిత్ జేయకొడి వంటి పలువురు ప్రముఖులు విడుదల చేసి, యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
జీవితంలోని సవాళ్ల మధ్య ప్రేమ, మానవ సంబంధాల విలువలు, హృదయాన్ని తాకే భావోద్వేగాలతో కూడిన అందమైన ప్రయాణంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. వినోదం, భావోద్వేగం, విలువలు మేళవించిన కథను నిజాయితీగా తెరకెక్కిస్తున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన ‘కోర్ట్’ సినిమాకు డైలాగ్స్, స్క్రీన్‌ప్లే అందించిన రామ్ జగదీష్ ఈ చిత్రానికి కూడా డైలాగ్స్, స్క్రీన్‌ప్లే అందించడం విశేషం.
సంగీతాన్ని సూరజ్ ఎస్ కురుప్ అందిస్తుండగా, అరవింద్ తిరుకోవెల డీవోపీగా, రవితేజ గిరిజాల ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. యువరాజ్ తేజ కాండ్రకోట, రామ్ జగదీష్, విజయ్ ఆదిరెడ్డి స్క్రీన్ ప్లే సమకూర్చారు. ఈ రోజు ప్రారంభమైన ఈ ప్రయాణంలో త్వరలోనే ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్, ట్రైలర్ వంటి ఆసక్తికర అప్‌డేట్స్ రానున్నాయి.


