నా కామెడీకి నేనే వారసుడిని..


తెలుగు చలన చిత్ర రంగంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి మరియు తన కామెడితో ‘నటకిరీటి’ గా పిలిపించుకున్న హీరో డా. రాజేంద్ర ప్రసాద్. ఆయన నటించిన ‘ఓనమాలు’ చిత్రం ఈ శుక్రవారం విడులవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ఓ పత్రికా ఇంటర్వ్యూలో మీరు హీరోగా కామెడీ చిత్రాలు తీయడం మానేసిన తర్వాత మీ కామెడీని ఏ హీరో అయినా భర్తీ చేశారా? అని అడిగిన ప్రశ్నకు రాజేంద్ర ప్రసాద్ సమాధానమిస్తూ ” నేను ఇంకా కామెడీని వదిలిపెట్టలేదు, నేను నటించినంత కాలం నా శైలి కామెడీ కొనసాగుతూనే ఉంటుంది. నాకు నేనుగా ఒక ప్రత్యేకమైన ట్రెండ్ ని సృష్టించుకున్నాను, దానికి ఎవరూ వారసులు కాలేరు. ప్రస్తుతం నా కామెడీని చాలా మంది అనుకరిస్తున్నారు కానీ నా వారసులు అంటూ ఎవేరూ లేరు. చాలా మంది ఇదే విషయాన్ని చర్చించి చివరికి నా కామెడీకి నేనే వారసుడినని, ఎవరూ నాకు వారసుడు కాలేరని తేల్చారు. నాకు తెలిసినంత వరకు తమకంటూ ఒక శైలిని మరియు ప్రత్యేకతని సంపాదించుకుంటారో అప్పుడే ఆ వ్యక్తికి గుర్తింపు వస్తుందని” ఆయన అన్నారు.

‘ఓనమాలు’ చిత్రంలో కళ్యాణి కథానాయికగా నటించారు. ‘మంచి జ్ఞాపకం లాంటి సినిమా’ అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి క్రాంతి మాధవ్ దర్శకుడు మరియు నిర్మాత. కోటి ఈ చిత్రానికి సంగీతం అందించారు.

Exit mobile version