తెలుగు సినిమాలకు ఇంకా జాతీయ అవార్డు గెలుచుకునే స్థాయి లేదని టాలీవుడ్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఎస్. గోపాల్ రెడ్డి గారు అన్నారు. ‘ ప్రస్తుతం సినిమా ప్రొడక్షన్లో చాలా మార్పు వచ్చింది. సినిమా బడ్జెట్ విషయంలో సినిమాకి ఖర్చు పెట్టే దాని కంటే అందులో నటించే నటీనటుల పారితోషికమే ఎక్కువగా ఉండడంతో కమర్షియల్ సినిమాలే మన ముందుకు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రయోగాత్మక సినిమాలను మరియు కొత్త రకమైన సినిమాలను నిర్మాతలు మాత్రం ఎలా ప్రోత్సహిస్తారు. టెక్నికల్ స్టాఫ్ మీద ఎక్కువ మనీ ఖర్చు పెడితే అద్భుతమైన సాంకేతిక విలువలు కలిగిన విజువల్స్ తెరపై కనిపిస్తాయి’ అని ఆయన అన్నారు.
సినిమాటోగ్రాఫర్ గా కొన్ని దశాబ్దాల అనుభవం ఉన్న గోపాల్ రెడ్డి గారు 2011 నంది అవార్డ్స్ కమిటీకి చైర్మెన్ గా వ్యవహరించారు. నంది అవార్డ్స్ నామినేషన్ మూవీస్ గురించి మాట్లాడుతూ ‘ ఈ సంవత్సరం నంది అవార్డ్స్ కి చాలా మంచి సినిమాలు నామినేట్ అయ్యాయి, కానీ నేషనల్ అవార్డ్స్ గెలుచుకోవడానికి ఈ పనితనం సరిపోదు’ అని ఆయన అన్నారు.
ఈ నంది అవార్డుల సందర్భంగా గోపాల్ రెడ్డి గారు ఒక మంచి విషయాన్నే చెప్పారు దీన్ని అందరూ ఒప్పుకుంటారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల వల్ల చేయడానికి ఎవరూ మక్కువ చూపక పోవచ్చు. గతంలో మన సీనియర్ నటులు కూడా కమర్షియల్ మరియు మాస్ మసాల సినిమాలు తీసి విజయాలు అందుకున్నారు, కానీ వారు ప్రయోగాత్మక సినిమాలు కూడా చేసారు. బహుశా ఇప్పుడు అలాంటి సినిమాలు రాకపోవడానికి ప్రేక్షకులు కూడా కారణం కావచ్చు.