విక్టరీ వెంకటేష్ – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి ఓ సినిమాలో నటించనున్నారు..! ఇది మిమ్మల్ని ఒకింత ఆశ్చర్యానికి గురిచేసినా వార్త మాత్రం నిజం. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘ఓ మై గాడ్’ సినిమాకి రీమేక్ గా ఈ సినిమాని తెరకెక్కించనున్నారు. ఇందులో బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ చేసిన శ్రీ కృష్ణుని పాత్రలో పవన్ కళ్యాణ్, పరేష్ రావల్ చేసిన ఓ సాధారణ వ్యాపారి పాత్రలో వెంకటేష్ కనిపించనున్నారు.
బాలీవుడ్ లో కాసుల వర్షం బాగానే కురిపించిన ‘ఓ మై గాడ్’ స్టొరీకి ఆంధ్ర ప్రదేశ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునే సత్తా ఉంది. మామూలుగా వెంకటేష్, పవన్ కళ్యాణ్ మంచి ఫ్రెండ్స్. వీరిద్దరి కాంబినేషన్లో మూవీ అని అనౌన్స్ చేయగానే అభిమానుల్లో కొత్త ఉత్సాహం కనబడుతోంది. ఈ చిత్ర ప్రొడక్షన్ టీం ఈ వార్తని ఖరారు చేసింది.
సురేష్ ప్రొడక్షన్స్ – నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా కలిసి ఈ సినిమాని నిర్మించనున్నారు. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత శరత్ మరార్ పవన్ కళ్యాణ్ కి మంచి ఫ్రెండ్. గతంలో ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’, ‘తడాఖా’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన డాలీ ఈ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం ఉంది. కానీ అది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.