“ఒక మంచి ప్రేమ కథ” ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో దర్శకుడు కాన్ఫిడెన్స్ స్టేట్మెంట్

“ఒక మంచి ప్రేమ కథ” ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో దర్శకుడు కాన్ఫిడెన్స్ స్టేట్మెంట్

Published on Oct 12, 2025 7:30 AM IST

oka-manchi-premakatha

నటీనటులు రోహిణి హట్టంగడి, రోహిణి ముల్లేటి, సముద్రఖని, హిమాంశు పోపూరి, సౌమ్య, అనన్య నన్నపనేని ప్రధాన పాత్రలో రానున్న చిత్రం ‘ఒక మంచి ప్రేమ కథ’. ఈ చిత్రాన్ని హిమాంశు పోపూరి నిర్మిస్తుండగా.. అక్కినేని కుటుంబరావు తెరకెక్కించారు. ఈ మూవీకి కథ, మాటలు, పాటల్ని ఓల్గా అందించారు. ఈ సినిమాకు లక్ష్మీ సౌజన్య ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం నాడు ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో..

వెర్సటైల్ నటి రోహిణి ముల్లేటి మాట్లాడుతూ .. ‘‘కోర్ట్’ సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చాను. ఎప్పుడూ మంచి కథలతో ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందంగా ఉంది. ఇప్పుడు ‘ఒక మంచి ప్రేమ కథ’తో రాబోతోన్నాను. ఓల్గా గారు రాసిన కథ నాకు చాలా నచ్చింది. కుటుంబరావు గారి ‘తోడు’ సినిమా నాకు ఎంతో ఇష్టం. మళ్లీ ఇన్నేళ్లకు ఆయన ఇలా సినిమా తీయడం సంతోషంగా ఉంది. నేను, రోహిణి గారు చాలా ఏళ్ల క్రితం కలిసి నటించాం. మళ్లీ ఇప్పుడు ఇలా నటించడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నా పాత్రను చూస్తే ఆడియెన్స్ కోప్పడతారు. రాధాకృష్ణన్ గారి సంగీతం మనసుని హత్తుకుంటుంది. నేను సినిమాను చూసి కంటతడి పెట్టుకున్నాను. ఈ చిత్రంలో అందరూ అద్భుతంగా నటించారు. మేం అడిగిన వెంటనే సపోర్ట్ చేసిన సముద్రఖని గారికి థాంక్స్. మా సినిమాను ముందుకు తీసుకు వెళ్తున్న ఈటీవీ విన్ టీంకు థాంక్స్’ అని అన్నారు.

నిర్మాత హిమాంశు పోపూరి మాట్లాడుతూ .. ‘నాకు ‘ఒక మంచి ప్రేమ కథ’ స్టోరీ విన్న వెంటనే కనెక్ట్ అయ్యాను. ఇందులో ఓ పాత్రని కూడా నేను చేశాను. మూవీ అద్భుతంగా వచ్చింది. ప్రతీ ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుంది’ అని అన్నారు.

రచయిత్రి ఓల్గా మాట్లాడుతూ .. ‘నేను ఈ కథను ముందుగా చిన్నగా రాసుకున్నాను. సినిమాగా తీస్తే బాగుంటుందని చాలా మంది సలహాలు ఇచ్చారు. ఇక హిమాంశు వచ్చిన ఈ కథను సినిమాగా తీయాలని పట్టుబట్టారు. రోహిణి ముల్లేటి గారు ముందు నుంచీ ఈ కథతో ప్రయాణం చేశారు. మా ప్రాజెక్ట్‌లోకి రోహిణి హట్టంగడి రావడంతో ఆనందమేసింది. సముద్రఖని గారు ఎంత బిజీగా ఉన్నా కూడా మాకు డేట్లు ఇచ్చారు. మంచి సినిమా రావాలని కోరుకునే ఆర్టిస్టులు మాకు దొరకడం మా అదృష్టం. ఈటీవీ విన్ మా సినిమాను తీసుకోవడం మరో అదృష్టం. 1985 నుంచి 2017 వరకు నేను రాసిన ప్రతీ నవల చతురలో వచ్చింది. నేను ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్‌లోనూ చాలా కాలం పని చేశాను. మళ్లీ ఇప్పుడు నా సినిమా ఈటీవీ విన్‌లో రావడం ఆనందంగా ఉంది. పెద్దవాళ్లందరూ కలిసి నటించిన చిత్రమే అయినా ఇది యువతరానికి సంబంధించిన కథ’ అని తెలిపారు.

ఇక దర్శకుడు అక్కినేని కుటుంబరావు మాట్లాడుతూ.. ‘సినిమాకి స్క్రిప్ట్ ఎంత ముఖ్యమో.. ఆర్టిస్టులు అంత ముఖ్యం.. ఆ తరువాత టెక్నీషియన్లు మరింత ముఖ్యం. గుమ్మడి గారికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ‘తోడు’ సినిమాలో రోహిణి హట్టంగడి గారిని తీసుకు లేకపోయాను. అయినా సరే ఆమెకు 37 ఏళ్ల తరువాత ఈ కథ చెప్పడానికి వెళ్లాను. రోహిణి ముల్లేటి గారు లేకపోతే ఈ చిత్రం ముందుకు వచ్చేది కాదు. సముద్రఖని గారు ఎంత బిజీగా ఉన్నా కూడా మాకు సపోర్ట్ చేశారు. మధు అంబట్, రాధాకృష్ణన్, లెనిన్ లేకపోతే ఈ చిత్రం లేదు. ఓల్గా గారు మంచి కథను, మాటల్ని, పాటల్ని ఇచ్చారు. కోట్లు సంపాదించేందుకు పరుగులు పెడుతున్నారు.. కానీ తల్లిదండ్రుల్ని పట్టించుకోవడం లేదు. అందరిలోనూ ఆలోచనను రేకెత్తించేలా ఈ సినిమాను తెరకెక్కించాను. ఎక్కడా బోర్ కొట్టించకుండా నవ్విస్తూ, ఏడ్పించేలా ఈ మూవీని తీశాను. ఈటీవీ విన్‌లో మా సినిమా వస్తుండటం ఆనందంగా ఉంది. మా కోసం వచ్చిన ప్రభు గారికి థాంక్స్’ అని తెలిపారు..

ఈటీవీ ప్రతినిధి సంధ్య మాట్లాడుతూ.. ‘‘ఒక మంచి ప్రేమ కథ’ కేవలం ఓ సినిమా మాత్రమే కాదు. ప్రస్తుతం ఉన్న తరానికి అవసరయ్యే చిత్రమిది. ప్రతీ ఒక్కరూ తమని తాము చూసుకున్నట్టుగా అనిపిస్తుంది. ప్రతీ ఒక్కరూ ఈ మూవీని చూడండి. ఈటీవీ విన్‌లో ఈ మూవీ అక్టోబర్ 16న రాబోతోంది’ అని అన్నారు.

ఈటీవీ ప్రతినిధి నితిన్ మాట్లాడుతూ .. ‘గొప్ప వాళ్లందరూ కలిసి ఉన్న ఈ స్టేజ్ మీద నేను ఉండటం గర్వంగా అనిపిస్తుంది. అమ్మమ్మ పాత్ర అంటే రోహిణి హట్టంగడి, అమ్మ పాత్రలు అంటే రోహిణి ముల్లేటి గారు గుర్తుకు వస్తారు. ఇంత గొప్ప సినిమాను మాకు ఇచ్చిన కుటుంబరావు గారికి థాంక్స్. రాధాకృష్ణన్ గారు మళ్లీ ఇలా కమ్ బ్యాక్ ఇవ్వడం ఆనందంగా ఉంది. సంధ్య గారి వల్లే ఈ మూవీ ఈటీవీ విన్‌లోకి రాబోతోంది. అక్టోబర్ 16న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

నటి సౌమ్య మాట్లాడుతూ.. ‘లక్ష్మీ సౌజన్య గారి వల్లే నాకు ఇంత మంచి చిత్రంలో పాత్ర లభించింది. సీనియర్ ఆర్టిస్టులతో నటించడం నాకు ఆనందంగా ఉంది. మళ్లీ మళ్లీ ఈ టీంతో కలిసి నటించాలని ఉంది’ అని అన్నారు.

తాజా వార్తలు