యంగ్ హీరో నిఖిల్ చేతిలో పలు ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటిలో ఒకటి ‘కార్తికేయ 2’. గతంలో చందూ మొండేటి డైరెక్షన్లో నిఖిల్ చేసిన ‘కార్తికేయ’ చిత్రానికిది సీక్వెల్. ‘కార్తికేయ’ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలుసు. అందుకే ఈ సీక్వెల్ మీద మంచి హైప్ ఉంది. మార్చి నెలలోనే మొదలైన ఈ చిత్రం లాక్ డౌన్ కారణంగా ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు పరిస్థితులు అనుకూలించడంతో షూటింగ్ రీస్టార్ట్ కానుంది.
డిసెంబర్ నుండి సినిమా సెట్స్ మీదకి వెళ్లనుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘కార్తికేయ’ తరహాలోనే ఇది కూడ సూపర్ నాచ్యురల్ థ్రిల్లర్. మొదటి పార్ట్ కంటే ఇందులోనే ఎక్కువ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయని, సినిమా కథ శ్రీకృష్ణుని నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది. నిఖిల్ సైతం ఈ చిత్రంపై భారీ హోప్స్ కలిగి ఉన్నారు. ‘కార్తికేయ’ తరహాలోనే ఇది కూడ కమర్షియల్ హిట్ అయి తన మార్కెట్ లెవల్ పెంచుతుందని భావిస్తున్నారు.