వివాదాలతో పాటు ఏదో ఒక విభిన్నతతో సినిమాలు తీసే రామ్ గోపాల్ వర్మ తీసిన తాజా చిత్రం ‘సత్య 2’. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం నిన్న సాయంత్రం హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకకి ప్రముఖ దర్శకులైన పూరి జగన్నాథ్, హరీష్ శంకర్, బోయపాటి శ్రీనులతో పాటు హీరో శర్వానంద్, రామ్ గోపాల్ వర్మ, మంచు విష్ణు, లక్ష్మీ మంచు తదితరులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ ‘ నాకు ఎప్పటి నుంచో ఓ ప్రేమ గీతం పాడాలనే కోరిక ఉండేది. ఆ కోరికని ఈ సినిమాతో తీర్చుకున్నాను. సత్య కి సత్య 2 కి చాలా తేడా ఉంది. నాకు క్రిమినల్స్ సంబందాలు ఉండటం వల్లే రియలిస్టిక్ గా ఇలాంటి సినిమాలు తీస్తానని చాలా మంది అంటుంటారు. వాస్తవానికైతే నేను ఒక్కసారి కూడా ఏ క్రిమినల్ తోనూ డిన్నర్ చేయలేదు. అలాగే నేను ముంబై కి వెళ్లి నప్పుడు నాకు గ్యాంగ్ స్టర్ ల గురించి ఏమీ తెలియదు ఎన్నో పుస్తకాలు చదివి వారి ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసుకున్నాను. ఆ అవగాహనతో నేనే మాఫియా రంగంలోకి వెళితే ఎలా ఉంటుందా అనేదే ఈ చిత్ర కథాంశం అని’ తెలిపాడు.