నయనతార డాక్యుమెంటరీ నిర్మాతలకు షాకిచ్చిన మద్రాస్ హైకోర్టు

స్టార్ బ్యూటీ నయనతార కొంతకాలంగా ఏదో ఓ వివాదంలో ఉంటూ వార్తల్లో నిలుస్తోంది. అయితే ఆమె కెరీర్‌పై ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ‘‘నయనతార : బియాండ్ ది ఫెయిరీటేల్’’ అనే డాక్యుమెంటరీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తన కెరీర్‌లో ఎలాంటి ఎత్తుపల్లాలు ఉన్నాయో వాటిని కవర్ చేస్తూ.. తన పర్సనల్ లైఫ్‌లో ఎలాంటి కష్టాలను ఎదుర్కుందో తెలుపుతూ ఈ డాక్యుమెంటరీ తెరకెక్కించారు.

అయితే, ఈ డాక్యుమెంటరీ రిలీజ్ అయిన తర్వాత పలు వివాదాలకు దారి తీసింది. ముఖ్యంగా ఈ డాక్యుమెంటరీలో నయనతార నటించిన సినిమాలకు సంబంధించిన సీన్స్ కూడా ఉండటంతో పలువురు నిర్మాతలు మండిపడ్డారు. ఇందులో ‘చంద్రముఖి’ చిత్రానికి సంబంధించిన సీన్స్ కూడా వినియోగించడంతో ఆ సినిమా కాపీరైట్స్ తమ వద్ద ఉన్నాయని ఏపీ ఇంటర్నేషనల్ అనే సంస్థ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్‌పై మద్రాసు హైకోర్టు విచారణ చేపట్టి తాజాగా ఈ డాక్యుమెంటరీ నిర్మాత టార్క్ స్టూడియోస్ మరియు నెట్‌ఫ్లిక్స్‌కు నోటీసులు జారీ చేసింది.

తమ నుంచి పర్మిషన్ తీసుకోకుండా సినిమాలోని ఫుటేజీని వాడుకున్నారని.. దానిని వెంటనే తీసేయాలని.. అలాగే తమకు రూ.5 కోట్ల నష్టపరిహారం కూడా ఇవ్వాలని ఎపి ఇంటర్నేషనల్ తమ పిటీషన్‌లో పేర్కొంది. మరి ఈ వివాదంపై నయనతార డాక్యుమెంటరీ నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి. అయితే, గతంలో ధనుష్ ప్రొడ్యూస్ చేసిన ‘నానుమ్ రౌడీ ధాన్’ చిత్రంలోని ఫుటేజీని వాడారని నయనతార, నెట్‌ఫ్లిక్స్ లపై ధనుష్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

Exit mobile version