“నాయక్” చిత్రానికి వచ్చిన స్పందన చుసిన అమల పాల్ ఆనందంలో తేలియాడుతున్నారు. ఈ చిత్రంలో ఆమెది చిన్న పాత్రే అయినా ఐస్లాండ్ లో చిత్రీకరించిన “శుభలేఖ రాసుకున్నా” పాట అందరిని ఆకట్టుకుంది. ఒక ప్రముఖ దినపత్రికతో మాట్లాడుతూ “ఆ పాట చిత్రీకరణకు ముందు చిరంజీవి మరియు రాధా మధ్యన వచ్చిన పాత పాటను చూసాను. ఆ పాట చూసాక ఈ పాట చెయ్యడం ఎంత కష్టమో అర్ధం అయ్యింది. పాటలో డాన్స్ మూవ్ మెంట్స్ కన్నా హావభావాలకు ప్రాధాన్యం ఎక్కువని అర్ధం అయ్యింది. దాదాపుగా వందసార్లకు పైగా ఆ పాటను చూసాను. నాయక్ లో నేను చేసిన పాట అందరికి నచ్చింది నాకు చాల సంతోషంగా ఉంది” అని అన్నారు.
ఈ పాటలో విజువల్స్ చూసాకనే బండ్ల గణేష్ నిర్మిస్తున్న “ఇద్దరమ్మాయిలతో” చిత్రంలో అమల పాల్ ఎంపిక అయ్యింది. “నాయక్ చిత్రంలో గ్లామర్ ప్రాదాన్యం ఉన్న పాత్ర చేశాను “ఇద్దరమ్మాయిలతో” చిత్రంలో పాత్రకు కాస్త ప్రాధాన్యం ఉంది. పూరి జగన్నాథ్ మరియు అల్లు అర్జున్ తో కలిసి పని చెయ్యడం చాలా ఆనందంగా ఉంది” అని అన్నారు. ప్రస్తుతం ఈ చిత్రం బ్యాంకాక్ అడవుల్లో ఫైట్ సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటుంది. కేథరిన్ తెరెసా ఈ చిత్రంలో నటిస్తున్న మరో కథానాయిక పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తుండగా గణేష్ బండ్ల నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.