ఈ రోజు జరిగిన ‘ఊ కొడతారా ఉలిక్కి పడతారా’ చిత్ర ప్రెస్ మీట్లో డా. మోహన్ బాబు ఆడపడుచు సెంటిమెంట్ ని గుర్తుకుతెచ్చుకున్నారు. డా. మోహన్ బాబు మాట్లాడుతూ ” ఆడపడుచు సెంటిమెంట్ తో తెరకెక్కిన నా బ్లాక్ బస్టర్ చిత్రాలు ‘పెదరాయుడు’, ‘అల్లరి మొగుడు’, ‘బ్రహ్మ’ మరియు ‘రౌడీ గారి పెళ్ళాం’ మొదలైన సినిమాలను ఆంధ్రప్రదేశ్ ఆడపడుచులు అమితంగా ఆదరించారు. నేను సినీ ప్రస్థానం మొదలు పెట్టి విలన్ పాత్రలు చేస్తున్నపుడు కూడా ఆడపడుచులకు ఎంతగానో సపోర్ట్ చేసేవాన్ని. అలాంటి ఆడపడుచులకు ఎంతో ముఖ్యమైన శ్రావణ శుక్రవారం రోజున ‘ఊ కొడతారా ఉలిక్కి పడతారా’ సినిమాని వారికి కానుకగా ఇస్తున్నాను. ఈ చిత్రాన్ని జూలై 27న విడుదల చేయడానికి అదే ముఖ్య కారణం” అని ఆయన అన్నారు.
‘ఊ కొడతారా ఉలిక్కి పడతారా’ చిత్రాన్ని జూలై 27న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. మోహన్ బాబు ఇప్పటి వరకూ నిర్మించిన అన్ని చిత్రాల కంటే అత్యధిక భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు వారికి ఎంతో పవిత్రమైన శ్రావణ శుక్రవారం రోజున విడుదలవుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి ఆడపడుచు సెంటిమెంట్ కలిసి వస్తుందని మోహన్ బాబు భావిస్తున్నారు. మంచు మనోజ్ మరియు దీక్షా సేథ్ లు ప్రముఖ పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో నటసింహం నందమూరి బాలకృష్ణ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు.