మెగా హీరో చేయబోతున్న రిస్క్ ఫలించాలి

మెగా హీరో సాయి తేజ్ ప్రస్తుతం దేవ కట్టతో కొత్త చిత్రం ప్రారంభించడానికి సన్నద్దమవుతున్నారు. వరుసగా ఆరు ఫ్లాపుల తర్వాత ‘చిత్రలహరి, ప్రతిరోజూ పండగే’ లాంటి విజయాలతో ఇప్పుడిప్పుడే తేరుకున్న తేజ్ ఆ తరహాలోనే ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే ఎంటెర్టైనర్ చేస్తున్నారు. ఈ వేసవిలోనే చిత్రం విడుదలకానుంది. కొన్నాళ్ల క్రితం వరకు బలంలేని కథల్ని ఎంచుకుని బోర్ కొట్టించిన తేజ్ ఇప్పుడు జాగ్రత్తగా సినిమాలు చేస్తుండటంతో మెగా అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.

ఇకపై కూడా తేజ్ ఇలాగే కుటుంబ కథా చిత్రాలను, సింపుల్ లవ్ ఎంటెర్టైనర్లను చేస్తూ వెళితే కెరీర్ నిలబడుతుందని భావించారు. కానీ తేజ్ మాత్రం దేవ కట్టతో సినిమాకు ఓకే చెప్పి రిస్క్ తీసుకోవడానికి రెడీ అయ్యారు. దేవ కట్ట స్టైల్ పూర్తిగా వేరు. ఆయన కథల్లో భిన్నత్వమే కాదు రిస్క్ కూడా ఎక్కువే. ప్రేక్షకులకు ఆయన సినిమాలు నచ్చితే విపరీతంగా నచ్చుతాయి లేదా అస్సలు ఎక్కవు. అందుకు ఉదాహరణలే ‘ప్రస్థానం, ఆటోనగర్ సూర్య’ చిత్రాలు. అలాంటి దర్శకుడితో సినిమా అంటే ప్రయోగమనే అనాలి.

వరుస దెబ్బల నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తేజ్ ఈ ప్రయోగమే చేస్తున్నారిప్పుడు. ఈ ప్రయోగం బెడిసికొట్టకుండా ఫలిస్తే తేజ్ ఇమేజ్ ఖచ్చితంగా పెరుగుతుంది. భిన్నమైన కథలు రాసుకునే దర్శకులకు మంచి ఛాయిస్ అవుతాడు.
కాబట్టి తేజ్ రిస్క్ వర్కవుట్ కావాలని కోరుకుందాం.

Exit mobile version