విడుదల తేదీ : ఆగస్టు 22, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్, సంగీత, రాజేంద్ర ప్రసాద్, గౌతం వాసుదేవ్ మీనన్, రాగ్ మయూర్ మరియు ఇతరులు.
దర్శకుడు : ప్రవీణ్ కాండ్రేగుల
నిర్మాతలు : విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువ
సంగీతం : గోపీ సుందర్
సినిమాటోగ్రఫీ : మృదుల్ సుజిత్ సేన్
ఎడిటింగ్ : ధర్మేంద్ర కాకరాల
సంబంధిత లింక్స్ : ట్రైలర్
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రమే “పరదా”. డీసెంట్ ప్రమోషన్స్ నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
పడతి అనే ఒక కల్పిత గ్రామానికి చెందిన యువతి సుబ్బలక్ష్మి (అనుపమ పరమేశ్వరన్) సుబ్బుగా పిలవబడుతుంది. తన గ్రామానికి చెందిన పాత కాలం పద్దతులకి విధేయురాలిగా సుబ్బు నడుచుకుంటుంది. అయితే ఆ గ్రామ సాంప్రదాయం ప్రకారం ప్రతీ మహిళ తమ ముఖాన్ని పరదాతో కప్పుకొని ఉంచి తీరాలి. కేవలం కుటుంబీకులు తప్పితే మరెవరు చూడడానికి వీలు లేదు. ఇలా సాంప్రదాయాలు కానీ ఉల్లంఘిస్తే ఆ ఊరి దేవత జ్వాలమ్మ ఆగ్రహానికి లోను కావాల్సి వస్తుంది అని గ్రామస్తులు నమ్ముతారు. మరి ఈ క్రమంలో జరిగిన ఒక ఊహించని ఘటన సుబ్బు జీవితాన్ని ఎలా మార్చేసింది. ఈ ప్రయాణంలో రత్నమ్మ (సంగీత క్రిష్) అలాగే అమిష్ట (దర్శన రాజేంద్రన్) ల పాత్రలేంటి? చివరికి సుబ్బు ఆ గ్రామం కోసం ఏం చేసింది అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి.
ప్లస్ పాయింట్స్:
టిల్లు స్క్వేర్ నుంచి ఒక కంప్లీట్ గ్లామరస్ రోల్ తర్వాత అనుపమ నుంచి పూర్తిగా డిఫరెంట్ రోల్ పరదాలో చేసింది అని చెప్పాలి. ఈ చిత్రంలో సుబ్బలక్ష్మిగా ఆమె మారిన తీరు అలాగే కనబరిచిన నటన చాలా బాగున్నాయి. చాలా సింపుల్ అండ్ సెటిల్డ్ గా అనుపమ తన పాత్రలో ఒదిగిపోయింది. ఎమోషన్స్ పరంగా ఇతర కీలక సన్నివేశాల్లో అనుపమ బాగా చేసింది.
ఇక తనతో పాటుగా మరో ఇద్దరు అమ్మాయిలు ఈ సినిమాలో హైలైట్ అని చెప్పవచ్చు. దర్శన రాజేంద్రన్ పాత్ర సినిమాలో కొంచెం ప్రత్యేకంగా కనిపిస్తుంది. ముఖ్యంగా తనకి అనుపమ నడుమ సన్నివేశాలు సినిమాలో వర్కౌట్ అయ్యాయి. ఆమె తన పాత్రలో చాలా కాన్ఫిడెంట్ గా కనిపించడమే కాకుండా మంచి కామెడీ టైమింగ్ కూడా కనబరిచి ఆకట్టుకుంది.
అలాగే మరో అమ్మాయి సంగీత క్రిష్ సినిమాలో ఎంతసేపు ఉన్నామని కాదు ఉన్న కొంతలో కూడా ఎంత ప్రభావం చూపించాం అనేది ముఖ్యం అనే మాటకి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. తన పాత్రలో సహజత్వం అంతే సహజమైన నటన ఆమె కనబరిచి ఇంప్రెస్ చేస్తుంది. అలాగే సినిమాల్లో ధర్మస్థల ఎపిసోడ్స్ బాగున్నాయి. కీలక సన్నివేశాల్లో సంగీతం మంచి ప్రభావం చూపింది.
మైనస్ పాయింట్స్:
ఈ చిత్రంలో ఆది బాగానే అనిపిస్తుంది. మంచి కథ అందుకు తగ్గట్టుగా సెటప్ బాగున్నాయి కానీ నెమ్మదిగా కథనం ముందుకు వెళ్లే కొద్దీ పరిస్థితులు మారడం గమనించవచ్చు. ముఖ్యంగా పాత్రలు వాటిని తీర్చిదిద్దిన విధానం ఇంకాస్త మెరుగ్గా ఉండి ఉంటే బాగుండేది.
అనుపమ రోల్ లో కూడా అంతే. ఆమె పాత్ర చేసే పోరాటంలో అంత డెప్త్ కనిపించలేదు. అలాగే కథనం ఫస్టాఫ్ వరకు పర్వాలేదు అనుకుంటే సెకండాఫ్ లో అసలు సమస్య మొదలవుతుంది. ఇది స్లోగా రిపీటెడ్ గా కొనసాగుతున్న భావన కలుగుతుంది. ఎమోషన్స్ కూడా ఇంకా బాగా ప్లాన్ చేసి ఉంటే బాగుండేది.
ఇంకా దర్శన రాజేంద్రన్ రోల్ ని ఇంకా డెవలప్ చేసి మరింత స్క్రీన్ టైం ఉంచి ఉంటే బాగుండేది. ప్రముఖ ముఖాలు రాజేంద్ర ప్రసాద్, గౌతమ్ మీనన్ లాంటి వారు ఉన్నప్పటికీ వారిని సరిగ్గా వినియోగించుకోలేదు. యువ నటుడు రాగ్ మయూర్ రోల్ కూడా అంత ఇంపాక్ట్ కలిగించలేదు. ఇక సెకండాఫ్ లో కోల్పోయిన ఇంట్రెస్ట్ క్లైమాక్స్ వరకు అలా కొనసాగుతుంది.
సాంకేతిక వర్గం:
ఈ సినిమాలో నిర్మాణ విలువలు పర్వాలేదు. గోపి సుందర్ ఇచ్చిన సంగీతం బాగుంది. చాలావరకు సన్నివేశాల్లో ప్లస్ అయ్యింది. పాటలు కూడా ఓకే. మృదుల్ సుజిత్ ఇచ్చిన కెమెరా వర్క్ నీట్ గా ఉంది. ధర్మేంద్ర కాకర్ల ఎడిటింగ్ ఇంకా బెటర్ గా చేసి ఉంటే బాగుండేది.
ఇక దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల విషయానికి వస్తే.. ఈ ఏడాదిలోనే ‘శుభం’తో మహిళలకే మంచి ట్రీట్ ఇచ్చిన తాను పరదా తో కూడా అదే రీతిలో మహిళా ప్రాధ్యాన్యత ఉన్న సబ్జెక్టుని టచ్ చేశారు. అయితే మంచి లైన్ ని తీసుకొని ఫస్టాఫ్ వరకు బాగానే నడిపించారు కానీ మిగతా సగం మాత్రం ఇదే మూమెంటం లో కొనసాగలేదు. అలాగే కొన్ని పాత్రలని ఇంకా బాగా డిజైన్ చేసి ఉంటే బాగుండేది. ఓవరాల్ గా తన వర్క్ మాత్రం పూర్తిగా మెచ్చుకునేలా లేదని చెప్పక తప్పదు.
తీర్పు:
ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ‘పరదా’ చిత్రంలో మహిళలకి సంబంధించిన కొన్ని అంశాలు వారికి కనెక్ట్ అవుతాయి అలాగే ఫస్టాఫ్ వరకు కూడా బాగానే ఉంది కానీ ఒక స్లో సెకండాఫ్, కదలని మూమెంట్స్ ఆడియెన్స్ లో ఉన్న ఉత్సుకతను నీరసపరుస్తాయి. ఇంకా బలమైన ఎమోషన్స్ ఈ సినిమాలో మిస్ అయ్యాయి. సో వీటిని దృష్టిలో పెట్టుకుంటే మహిళలు వరకు కొన్ని చోట్ల సినిమా పర్వాలేదు అనిపిస్తుంది.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team