కోట శ్రీనివాస రావుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు


ఈ రోజు తెలుగు చలన చిత్ర రంగంలో విలనిజంకి మారు పేరుగా నిలిచిన విలక్షణ నటుడు కోట శ్రీనివాస రావు గారి పుట్టిన రోజు. ఈయన 1947 జూలై 10న విజయవాడలో జన్మించారు. చిన్న నాటి నుండి నాటకాలు అంటే ఆసక్తి ఉన్న ఈయన 1978లో క్రాంతి కుమార్ దర్శకత్వంలో వచ్చిన “ప్రాణం ఖరీదు” చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఈ రోజు ఆయన జన్మదిన సందర్భంగా కోట గారు పత్రికా విలేఖరులతో ముచ్చటించారు.

కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ ” ఒకప్పుడు సినిమా వ్యక్తులు అంటే సమాజంలో ఎనలేని గౌరవ మర్యాదలు ఉండేవి. కానీ ఇప్పుడు లేవు, ప్రస్తుతం సినిమా అనేది పూర్తి వ్యాపకంగా మారి సినిమా బజారున పడడంతో సినిమా వాళ్లైన మేము కూడా బజారునపడ్డాము. అప్పటికీ ఇప్పటికీ చలనచిత్ర రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఒకప్పుడు దర్శకులు ఫిల్మ్ ని వృధా చేయకుండా ఎంతో అవగాహనతో తీసేవారు, కానీ ఇప్పుడు వస్తున్న కొంతమంది దర్శకులు పూర్తి అవగాహన లేక టేకుల మీద టేకులు తీస్తున్నారు, ఏమన్నా అడిగితే ఇది డిజిటల్ యుగం అంటున్నారు. ఇలాంటి సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం రావడం వల్ల నిర్మాతలకు ఉపయోగం ఉండవచ్చు కానీ వాటి వల్ల మాలాంటి ఆర్టిస్టులకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోంది. ఒకే రకమైన పాత్రలు వస్తున్నపటికీ ఏదో ఒక కొత్తదనం చూపించడానికి ప్రయత్నిస్తాను, అందుకోసం ఇప్పటి రాజకీయ వేత్తలను స్పూర్తిగా తీసుకున్నాను. రోజూ టి.విలో వచ్చే వారి ప్రోగ్రామ్స్ చూసి వారి హావభావాలను అనుకరిస్తే చాలని” ఆయన అన్నారు.

కోట శ్రీనివాస రావు ఇప్పటి వరకు సుమారు 700 పైగా చిత్రాల్లో నటించారు. ఈయన ఒక్క తెలుగు భాషలోనే కాకుండా తమిళంలో 25, కన్నడంలో 6 మరియు హిందీలో 6 చిత్రాల్లో నటించారు. ఈయన కెరీర్లో ఇప్పటివరకు 6 నంది అవార్డ్స్ గెలుచుకున్నారు. ఇలానే ఇంకొన్ని మరిన్ని చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పు పొందాలని కోరుకుందాం.

ఈ రోజు కోట శ్రీనివాస రావు గారి పుట్టిన రోజు సందర్భంగా 123తెలుగు.కామ్ తరపున కోట గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.

Exit mobile version