ఇప్పుడు కరోనా మూలాన మొత్తం దేశ వ్యాప్తంగా ఎలాంటి పరిస్థిలు నెలకొన్నాయో చూస్తూనే ఉన్నాము. మళ్ళీ పాత రోజులు కూడా ఎప్పుడు వస్తాయో అర్ధం కానీ పరిస్థితులు నెలకొన్నాయి. దీనితో మొత్తం మానవాళి జీవిత శైలిలోనే పెను మార్పులు వచ్చేసాయి. అలాగే ఇవన్నీ చాలవు అన్నట్టు ఇపుడు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి ప్రకోపం కూడా తీవ్ర రూపంలో ఏర్పడింది.
ఇవన్నీ అటు తిరిగి ఇటు తిరిగి ఫైనల్ గా సినీ పరిశ్రమకే భారీ నష్టాన్ని తీసుకొచ్చే కారణాలుగా మారాయి. దీనితో మన దగ్గరమూవీ లవర్స్ లో థియేటర్ వరకు వెళ్లి సినిమా చూడాలి అనే ఆసక్తి నెమ్మదిగా క్షీణించడం మొదలు అయ్యిందని సుస్పష్టం అవుతుంది. ఇప్పటికే అన్ని భాషలతో పాటుగా మన తెలుగులో కూడా ఓటిటి ప్రభావం భారీ ఎత్తున పడింది.
లాక్ డౌన్ లో ఎప్పుడో మార్చ్ లో థియేటర్స్ మూత పడిన దగ్గర నుంచి ఒక్కసారిగా ఓటిటి వినియోగం అమాంతం పెరిగింది. అలాగే కరోనా ధాటి అంతకంతకు పెరుగుతుండడంతో కొత్త సినిమాలు విడుదలలు అన్నీ ఇందులోనే అవుతుంటే వాటికే జనం కూడా వాటికే అలవాటు పడిపోయారు. దీనితో థియేటర్ లో సినిమా చూడాలి అనే ధ్యాస దూరం అయ్యింది. అయితే ఓటిటి ప్రభావం ఎంత చూపినా థియేటర్స్ పవర్ థియేటర్ దే..
కానీ కొన్ని ప్రామాణికాలు మాత్రం థియేటర్స్ కు అనుకూలంగా లేవు. ఇది వరకు అంటే అన్ని సినిమాలు కూడా మొదట థియేటర్ లోనే బొమ్మ పడేది మీడియం బడ్జెట్ సినిమా అయినా సరే జనం థియేటర్స్ లో చూడాలి అనుకునే వారు కానీ ఇప్పుడు ఓ బడా సినిమా వస్తే తప్ప థియేటర్స్ లోకి వెళ్లే సాహసం చెయ్యడానికి సిద్ధపడడం లేదు.
ఇటీవలే దేశ వ్యాప్తంగా థియేటర్స్ ఓపెన్ చేసినప్పటికీ ఎక్కడా కూడా ఆడియెన్స్ ఆసక్తి కనబరచలేదు అంత రెస్పాన్స్ రాలేదు. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే చాలా వరకు ఎక్కడా థియేటర్స్ ఓపెన్ అయ్యింది లేదు. ఇవన్నీ భేరీజు వేసి చూస్తే మన దగ్గర ఆడియెన్స్ లో కూడా ఎక్కడో ఆసక్తి చూపడం లేదు అనిపిస్తుంది. ఇక్కడే మరో అంశం ఏమిటంటే థియేటర్స్ తెరుచుకున్న ఈ సమయంలోనే ప్రధాన థియేటర్స్ ఉన్న ప్రముఖ హైదరాబాద్ వంటి నగరాలను వాన ముంచెత్తేసింది.
దీనితో వెళ్దాం అనుకునే వారి ఆలోచనకు మరోసారి బ్రేక్ పడ్డట్టు అయ్యింది. దీనితో మన వాళ్ళు చూడ్డానికి అంతా ఓకే అయినా ప్రాణాల మీదకు వచ్చే ఇన్ని అడ్డంకులు ఉండడంతో తమ ఆసక్తిని ప్రత్యక్షం గానో లేక పరోక్షంగానో పోగొట్టుకుంటున్నారు. మళ్ళీ థియేటర్స్ కు పూర్వ వైభవం వచ్చి జనం అంతా సినిమాల వైపు ఆకర్షితులు అవుతారో అన్నది చూడాలి.