తెలుగు చిత్ర పరిశ్రమ ఎంతో కష్టపడి, భారీ బడ్జెట్ లు పెట్టి సినిమాలు తీస్తోంది. కొన్ని వందల మంది ఐదు, ఆరు నెలలు కష్టపడి తీసిన సినిమాని రిలీజ్ రోజే సీక్రెట్ కెమెరాలతో షూట్ చేసి పైరసీ సినిమాలను నెట్లోనూ, డివిడీలలోనూ కాపీ చేసి అమ్మేస్తున్నారు దీనివల్ల సినీ ఇండస్ట్రీ, ప్రభుతం చాలా నష్టపోతోంది. అందుకే తెలుగు ఫిలిం చాంబర్ ముందుకు వచ్చి యాంటీ పైరసీ సెల్ ని ప్రారంబించింది. ఇందులో భాగంగానే పైరసీ పై ఇంకా కఠినమైన చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో తెలుగు ఫిలిం చాంబర్ ‘ఇండియన్ మూవీ కాప్’ అనే యాంటి పైరసీ మొబైల్ ఫోన్ అప్లికేషన్ ని తయారు చేసింది.
ఆ అప్లికేషన్ లాంచింగ్ కార్యక్రమాన్ని ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాద్ లక్డికాపూల్ లోని డి.జి.పి ఆఫీస్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి యు.ఎస్ అంబాసిడర్ నాన్సీ జె. పావెల్ ముఖ్య అతిధిగా విచ్చేశారు. అలాగే సినీ ప్రముఖులు డా డి. రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, అల్లు అరవింద్, ఎన్.టి.ఆర్, ఎస్.ఎస్ రాజమౌళి, దిల్ రాజు తదితరులతో పాటు డి.జి.పి హాజరయ్యారు. ఇండస్ట్రీ ప్రముఖలు ఈ పైరసీ వల్ల జరుగుతున్న ఇబ్బందులను, వాటివల్ల తమకు వస్తున్న నష్టం గురించి, ఇలాగే జరిగితే కొన్ని రోజులకి సినిమా రంగమనేదే ఉండదు అనే విషయాలను యు.ఎస్ అంబాసిడర్ కి తెలియజేశారు.
ఇక అప్లికేషన్ గురించి – ఈ అప్లికేషన్ ని మీ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకోవచ్చు ఈ అప్లికేషన్ లో ఒక్క తెలుగు మాత్రమే కాకుండా తమిళ, మలయాళం, కన్నడ, హిందీ, గుజరాతీ, మరాఠీ మొదలైన భాషలకు సంబందించిన సినిమాల గురించి కూడా కంప్లైంట్ చెయ్యొచ్చు. ఈ అప్లికేషన్లో ఓన్లీ కంప్లైంట్స్ మాత్రమే కాకుండా తాజా సినిమా వార్తలు, వీడియోలు మొదలైనవి కూడా చూడొచ్చు. ముఖ్యంగా ఎవరైనా ఎక్కడైనా పైరసీ చేస్తున్నారని మీకు తెలిస్తే మీరు ఏ పోలీస్ స్టేషన్ కి వెళ్ళకుండా ఈ అప్లికేషన్ ద్వారా కంప్లైంట్ చేస్తే చాలు వారే మిగతా పనులు చూసుకుంటారు. అలాగే ఎక్కువగా ఎవరైతే పైరసీ పై కంప్లైంట్ చేస్తారో వారికి ప్రత్యేక బహుమతులను కూడా దీని ద్వారా కలుగజేయడం కొసమెరుపు.
ఈ అప్లికేష్ ని డౌన్ లోడ్ వివరాల కోసం పైన ఇచ్చిన ఫోటో లో చూడండి..